రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా అట్లూరు మండలం గుజ్జులవారిపల్లె వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి మృతిచెందాడు. కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
బంధువుల వివరాల ప్రకారం గుజ్జులవారిపల్లెకు చెందిన పుల్లయ్య, గోపాలమ్మ దంపతుల రెండో కుమారుడు గోపి పని నిమిత్తం బైకుపై కుంభగిరి వైపు బయల్దేరాడు. అదే సమయంలో మరో బైకుపై ఎదురుగా వచ్చిన అతని అన్న గోపాల్ వాహనం గోపి బైక్‌ను ఢీకొట్టినట్లు తెలిపారు.
ఢీకొన్న ప్రభావంతో గోపి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న గోపి ప్రాణాలు నిలువలేకపోయినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
పదో తరగతి చదువుతున్న గోపి మృతి వార్తతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. సోదరులిద్దరి బైకులు ఒకదానికొకటి ఢీకొనడం దురదృష్టకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదంపై స్థానిక పోలీసులు సమాచారం అందుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. ప్రమాదానికి గల కారణాలను వారు పరిశీలిస్తున్నారు.













