కడప: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ఇప్పటినుంచే సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు పోలీస్ అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కడప, మైదుకూరు, రాజంపేట సబ్ డివిజన్ల నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ట్రబుల్ మాంగర్లపై, ఎన్నికల నేరాలకు పాల్పడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి వాటిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

మహిళా భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఈవ్ టీజింగ్, మహిళలు, చిన్నారులపై నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, నిర్ణీత గడువులోగా చట్టపరమైన పరిధిలో పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజలకు సానుకూల అనుభవం కల్పించేలా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, న్యాయం ఆలస్యం కాకుండా చూడాలని జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు.

ఇటీవలి కాలంలో కేసులను ఛేదించి అత్యుత్తమ పనితీరు కనబరచిన పోలీస్ అధికారులను ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ప్రశంసించారు. కడప రిమ్స్ సి.ఐ ఎం. రాజగోపాల్, ఎస్.ఐ సి. లక్ష్మీనారాయణ, ఒంటిమిట్ట ఎస్.ఐ శ్రీనివాసులు, చాపాడు ఎస్.ఐ చిన్న పెద్దయ్యలకు ఎస్పీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసి ప్రశంసాపత్రాలు అందజేశారు.

నేర సమీక్షా సమావేశంలో అదనపు ఎస్.ఐ (అడ్మిన్) కె. ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి ఎన్. సుధాకర్, కడప ఇంచార్జ్ డి.ఎస్.పి ఇ. బాలస్వామి రెడ్డి, మైదుకూరు డి.ఎస్.పి జి. రాజేంద్ర ప్రసాద్, సి.ఐలు, ఎస్.ఐలు పాల్గొన్నారు.