కడప: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (ఎస్‌ఎస్‌ఆర్‌)లో భాగంగా జిల్లాలో ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చేరుకూరి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ శిబిరాలను నిర్వహించాలని సంబంధిత ఎన్నికల అధికారులను ఆయన ఆదేశించారు.

నాలుగు రోజుల పాటు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు), రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు అందుబాటులో ఉంటారని కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా ముసాయిదా ఓటరు జాబితాలు, ఏఎస్‌డీ జాబితాలను పరిశీలించడంతో పాటు ఓటర్ల సందేహాలను నివృత్తి చేసి, అవసరమైన దరఖాస్తులను స్వీకరించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రత్యేక శిబిరాలను ముఖ్యంగా 18–19 ఏళ్ల యువ ఓటర్లు నమోదుకు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ముసాయిదా ఓటరు జాబితాలో పేరు నమోదు కాని అర్హులైన పౌరులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఇందుకోసం అవసరమైన ఫారం-6, ఫారం-7, ఫారం-8, ఫారం-8ఎ దరఖాస్తులను పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రత్యేక శిబిరాలపై జిల్లాస్థాయి నుండి పోలింగ్ కేంద్రాల స్థాయి వరకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు స్థానిక ప్రచార మార్గాల ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి స్వయంగా పర్యవేక్షించడంతో పాటు, ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని ఆదేశించారు.

శిబిరాల సమయంలో బీఎల్‌ఓలు గైర్హాజరైతే తీవ్రంగా పరిగణించి సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణలో భాగంగా జూలై 31 నుండి ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలని, పేరు లేకపోతే నిర్దేశిత దరఖాస్తు ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.