రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా వ్యాప్తంగా శనివారం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై విస్తృత చర్యలు తీసుకున్నారు. మొత్తం 302 కేసులు నమోదు చేసి, రూ.62,765 జరిమానాలు విధించినట్లు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు.
జిల్లాలోని ప్రధాన రహదారులు, పట్టణ ప్రాంతాలు, జాతీయ రహదారులపై ప్రత్యేక బృందాలతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలు నడిపేవారు, సీట్ బెల్ట్ ఉపయోగించకుండా కార్లు నడిపేవారు, రాంగ్ రూట్‌లో ప్రయాణించే వాహనదారులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కార్లలో వెళ్లేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని అన్నారు.
రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని, ప్రజల ప్రాణ భద్రత కోసం ఈ తనిఖీలను కఠినంగా కొనసాగిస్తున్నామని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించాలంటే ప్రతి వాహనదారుడు తన బాధ్యతను గుర్తించి నిబంధనలు కచ్చితంగా పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
కడప జిల్లాలో ఇటీవలి కాలంలో ట్రాఫిక్ నియంత్రణను మరింత బలోపేతం చేయడానికి పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారికి ఎలాంటి సడలింపు ఉండదని ట్రాఫిక్ విభాగం అధికారులు తెలిపారు.













