తిరుపతి నుంచి తమిళనాడులోని తిరువణ్ణామలై వరకు ఉన్న రహదారిని అభివృద్ధి చేసి ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ముగ్గురు లోక్‌సభ సభ్యులు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని న్యూఢిల్లీలో కలిశారు. ఈ సమావేశంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్ది, తిరువణ్ణామలై ఎంపీ సి.ఎన్. అన్నాదురై పాల్గొన్నారు.

తిరుపతి–తిరువణ్ణామలై మార్గం రెండు రాష్ట్రాల ప్రజలకు ఎంతో కీలకమని, ముఖ్యంగా తిరుపతి, కాణిపాకం, వేలూరు, తిరువణ్ణామలై వంటి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించే భక్తులకు ఈ రహదారి ప్రాధాన్యం మరింత ఎక్కువగా ఉంటుందని ఎంపీలు నితిన్ గడ్కరీకి వివరించారు. ఈ మార్గంలో రోజురోజుకూ పెరుగుతున్న రాకపోకలను దృష్టిలో ఉంచుకుని రహదారిని అత్యవసరంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని వారు కేంద్ర మంత్రికి తెలియజేశారు.

రహదారి విస్తరణ, అవసరమైన చోట్ల అభివృద్ధి పనులు చేపట్టడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, వాహనదారులకు మెరుగైన భద్రత కల్పించేలా రహదారి ప్రమాణాలను పెంచడం వంటి అంశాలను ఎంపీలు గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మార్గం మెరుగుపడితే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య రవాణా మరింత సులభతరం అవుతుందని, రెండు రాష్ట్రాల ప్రజలు, భక్తులు, వ్యాపారులు గణనీయంగా ప్రయోజనం పొందుతారని వారు పేర్కొన్నారు.

తిరుపతి–తిరువణ్ణామలై రహదారి అభివృద్ధి ద్వారా ఆధ్యాత్మిక పర్యాటకానికి తోడు వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు కూడా ఊతం లభిస్తుందని ఎంపీలు కేంద్ర మంత్రికి వివరించినట్లు సమాచారం. ఈ మార్గంలో పెరుగుతున్న వాహనాల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలు రూపొందించాలని వారు కోరారు.

ఈ అంశంపై నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ మద్దిల గురుమూర్తి తెలిపారు. సంబంధిత అధికారులతో ఈ ప్రతిపాదనను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు గురుమూర్తి వెల్లడించారు.