కడప:- కడప లోని పాత కలెక్టర్ కార్యాలయం పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిపోతుండటం స్థానికుల్లో ఆందోళనకు దారితీస్తోంది. కోట్ల రూపాయల ప్రజా ధనంతో నిర్మించిన ప్రభుత్వ ఆస్తి అధికారుల నిర్లక్ష్యంతో పాడుబడిపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కలెక్టరేట్ కొత్త భవనానికి కార్యాలయాలు మారిన తర్వాత పాత కలెక్టర్ కార్యాలయం నిర్లక్ష్యానికి గురైంది. ఆ ప్రాంగణం చుట్టూ బీర్, మద్యం బాటిల్స్ ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో వాహనాల్లో కూర్చొని మద్యం సేవించే మందుబాబుల అడ్డాగా ఈ ప్రాంతం మారిపోయిందని స్థానికులు చెబుతున్నారు.

పాత కలెక్టరేట్ ముందు భాగంలోనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉండగా, అదే ప్రాంతం వద్ద ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు సాగడం పట్ల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ సమీపంలోనే వాహనాల్లో సిట్టింగ్ వేసుకుని మద్యం సేవించడం, ఆ ప్రాంతాన్ని బార్ల వాతావరణంగా మార్చేసిందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

పాత కలెక్టరేట్ ప్రాంగణంలో తుప్పు పట్టిన ప్రభుత్వ వాహనాలు నిర్లక్ష్యంగా పారేసి ఉన్నాయి. ఆ వాహనాల్లో అమర్చిన విలువైన పరికరాలు మాయమవుతున్నా, సంబంధిత శాఖాధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కోట్ల రూపాయల విలువైన ప్రజా ధనం ఇలా వృథా అవుతుండడంపై ప్రశ్నలు లేవుతున్నాయి.

మహిళా ప్రాంగణంలోనూ ఇదే దృశ్యం కనిపిస్తోంది. అక్కడ నిలిపిన స్వచ్ఛ్ ఆంధ్ర e-Crop వాహనాలు తుప్పు పట్టి పనికిరాని స్థితికి చేరుకున్నాయి. ఆ వాహనాల్లోని పరికరాలు కూడా కనిపించకుండా పోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయినా అధికారులు చోద్యం చూస్తూ వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

ఒకప్పుడు కలెక్టరేట్‌గా ఉపయోగించిన ఈ ప్రాంగణాన్ని ఇప్పుడు మహిళా ప్రాంగణంగా మార్చినప్పటికీ, అక్కడ కూడా పరిస్థితి మారలేదని ప్రజలు అంటున్నారు. ఎవరికి కనపడకుండా చాటు ప్రదేశానికి వాహనాలు, పరికరాలు మార్చేసి, వాటిని నిర్లక్ష్యంగా వదిలేయడంతో ప్రభుత్వ ఆస్తులు నష్టపోతున్నాయని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

పాత కలెక్టరేట్ భవనం, ప్రాంగణం పరిస్థితిపై సంబంధిత శాఖలు, జిల్లా అధికారులు తక్షణమే స్పందించి, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టి, ప్రభుత్వ ఆస్తులను సంరక్షించే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.