రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు పురపాలక సంఘం కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరిని మర్యాదపూర్వకంగా కలిశారు. నేడు 18.08.2026 తేదీన జరిగిన ఈ భేటీలో మున్సిపాలిటీ పనితీరు, కార్యాలయ నిర్వహణ, సిబ్బంది బాధ్యతలపై కలెక్టర్ సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని జాగ్రత్తగా ఏర్పాటు చేసుకొని ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని కమిషనర్‌కు సూచించారు. మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, పారదర్శకంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే మున్సిపాలిటీ సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించినట్లు కమిషనర్ తెలిపారు. సిబ్బంది హాజరు, పనుల పర్యవేక్షణ, ప్రజా సేవల అమలులో నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా చూడాలని జిల్లా యంత్రాంగం సూచనలు చేసినట్లు సమాచారం.
ప్రొద్దుటూరు మున్సిపాలిటీని రాష్ట్రంలోనే అత్యుత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు శ్రద్ధతో కృషి చేయాలని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ప్రత్యేకంగా ఆదేశించినట్లు కమిషనర్ పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధి, శుభ్రత, మౌలిక వసతుల మెరుగుదల, ప్రజా సౌకర్యాల విస్తరణపై దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించినట్లు తెలియజేశారు.
జిల్లా యంత్రాంగం నుండి ఎటువంటి సహకారం అవసరమైనా అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు కమిషనర్ తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాల అమలులో జిల్లా స్థాయి అధికారుల పూర్తి మద్దతు ఉంటుందని కలెక్టర్ భరోసా ఇచ్చినట్లు సమాచారం.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరికి తన కృతజ్ఞతలు తెలియజేసినట్లు కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాలను పాటిస్తూ జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వానికి విధేయుడిగా ఉంటానని, శక్తి వంచన లేకుండా ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ప్రజా సంతృప్తికర స్థాయిలో సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు.













