రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: క్రమశిక్షణ, అంకితభావంతో నిర్విరామంగా సేవలందించి పదవీ విరమణ పొందడం అభినందనీయమని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ పేర్కొన్నారు. జూన్ నెలాఖరున పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులను ఘనంగా సన్మానిస్తూ జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నాలుగు మంది ఎస్.ఐలు, ఒక ఆర్.ఎస్.ఐ, ఒక ఏ.ఎస్.ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్‌ను జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ ఘనంగా సన్మానించారు. వారికి జ్ఞాపికలు అందజేసి, వారి సేవలను గుర్తుచేసుకుంటూ పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, తమ విధి నిర్వహణ కాలంలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పదవీ విరమణ పొందిన అధికారుల కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. అప్పటి పరిస్థితులను ధీటుగా ఎదుర్కొంటూ, కుటుంబాలకు దూరంగా విధులు నిర్వహించడం సాధారణ విషయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎన్ని ఇబ్బందులున్నా, సమస్యలున్నా బాధ్యత అనే భావన పోలీస్ శాఖలో సమస్యలను అధిగమించేలా చేస్తుందని జిల్లా ఎస్పీ వివరించారు. విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారని, అలాంటి సేవలు చిరస్మరణీయమని ఆయన అన్నారు.
పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతూ, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ సూచించారు. పదవీ విరమణ తర్వాత కూడా వారు పోలీస్ కుటుంబ సభ్యులేనని, ఏమైనా సమస్యలుంటే నేరుగా తనను సంప్రదించవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు.
పదవీ విరమణ సన్మానం పొందిన పోలీస్ సిబ్బంది: ఎం.వి ఎస్. సుబ్బన్న, ఎస్.ఐ, డి.ఎస్.బి, కడప; సి.బాల అంకయ్య, ఎస్.ఐ, డి.ఎస్.బి, కడప; కె.నాగరాజు, ఎస్.ఐ, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, కడప; కె.చూడామణి వర్మ, ఆర్.ఎస్.ఐ, డి.ఏ.ఆర్, కడప; ఎస్.కె.ఎ. బాషా, ఎస్.ఐ, ప్రొద్దుటూరు త్రీ టౌన్ పీ.ఎస్; ఎం.ఎన్ రెడ్డి, ఏ.ఎస్.ఐ, ముద్దనూరు పి.ఎస్; ఆర్.వీరా రెడ్డి, హెచ్.సి, ప్రొద్దుటూరు త్రీ టౌన్ పీ.ఎస్.
కార్యక్రమంలో అదనపు ఎస్.పి (పరిపాలన) శ్రీ కె.ప్రకాష్ బాబు, ఏ.ఆర్ అదనపు ఎస్.పి శ్రీ బి.రమణయ్య, స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి శ్రీ ఎన్.సుధాకర్, ఏ.ఆర్ డి.ఎస్.పి శ్రీ పి.నాగేశ్వర రావు, డి.పీ.ఓ ఏ.ఓ జి.సుజాత, సూపరింటెండెంట్ శ్రీనివాసులు నాయక్, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, ఈ.సి మెంబర్స్ రామస్వామిరాజు, ఏప్రిన్, ఆర్.ఐలు సోమశేఖర్ నాయక్, టైటస్, ఆర్.ఎస్.ఐ వెంకటేశ్వర్లు, పదవీ విరమణ పొందిన వారి కుటుంబ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.













