కడప: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియను ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) కె. మల్లికార్జునుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం కలెక్టరేట్‌లోని డీఆర్‌ఓ ఛాంబర్‌లో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశానికి ZPP CEO సుబ్రహ్మణ్యం, DPO రామచంద్ర, మున్సిపల్ కమిషనర్లు, పట్టణ ప్రణాళిక అధికారులు హాజరయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఓటర్లకు సంబంధించిన వివరాలు ఖచ్చితంగా, తప్పులేకుండా నమోదు కావాల్సిన అవసరాన్ని డీఆర్‌ఓ ఈ సందర్భంగా అధికారులకు వివరించారు.

గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందస్తు ప్రణాళికతో సిద్ధం కావాలని డీఆర్‌ఓ సూచించారు. ఎన్నికల సిబ్బంది నియామకం, అవసరమైన సామగ్రి సేకరణ, శిక్షణా కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రతి పంచాయతీకి ఒక ప్రత్యేక గుర్తింపు అధికారిని నియమించి, ఓటర్ల జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వివరాలను ఎరుపు బాల్ పాయింట్ పెన్‌తో స్పష్టంగా గుర్తించాలని సూచించారు.

ఓటర్ల జాబితాలో నమోదైన ఇతర వివరాలతో సరిపోల్చుకున్న తర్వాతే తుది జాబితాను ఖరారు చేయాలని డీఆర్‌ఓ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా చూడాలని, గ్రామ స్థాయిలో బాధ్యతలు అప్పగించిన సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.

సమావేశంలో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన కీలక గడువులను డీఆర్‌ఓ ప్రకటించారు. ఆగస్టు 16 నుంచి 20 వరకు ఇంటింటి సర్వే ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు చేపడతారు. ఆగస్టు 21, 22 తేదీల్లో ఓటర్ల జాబితాలో ప్రతిపాదనల నమోదు జరుగుతుంది. ఆగస్టు 23న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు.

ఆగస్టు 24 నుంచి 26 వరకు ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆగస్టు 27 నుంచి 31 వరకు అభ్యంతరాలపై సంబంధిత అధికారులు విచారణ నిర్వహిస్తారు. సెప్టెంబరు 1 నుంచి 4 వరకు గ్రామ సభల్లో ఓటర్ల జాబితాను ప్రదర్శించి, ధ్రువీకరణ చేపడతారు. సెప్టెంబరు 5న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురిస్తారు.

ఓటర్ల సవరణ ప్రక్రియలో ఉపయోగించే ముఖ్యమైన ఫారాల వివరాలను కూడా డీఆర్‌ఓ ఈ సందర్భంగా వెల్లడించారు. ఓటర్ల జాబితాలో కొత్తగా పేరు చేర్చుకోవడానికి Form-2, ఇతరుల పేర్లపై అభ్యంతరాలు తెలియజేయడానికి Form-3, స్వయంగా తన పేరు నమోదుపై అభ్యంతరం వ్యక్తం చేయడానికి Form-4 వినియోగించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

అర్హులైన ప్రతి ఓటరు వివరాలను సరిగ్గా నమోదు చేసి, నిర్దేశిత గడువులలోగా తుది జాబితాను పూర్తి చేయాలని డీఆర్‌ఓ మల్లికార్జునుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేయాలని, ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.