రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు జిల్లా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) ఆధ్వర్యంలో గురువారం కడప నగరంలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జులై 30 ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా ప్రత్యేకంగా విద్యార్థినుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
సదస్సులో మానవ అక్రమ రవాణా, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మహిళల రక్షణకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు, శక్తి యాప్ వినియోగం, అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లపై విస్తృతంగా అవగాహన కల్పించారు. కార్యక్రమానికి సుమారు 250 మందికి పైగా విద్యార్థినులు హాజరై పోలీసు అధికారులు, ఇతర విభాగాల ప్రతినిధులు అందించిన సూచనలు, అవగాహన సందేశాలను ఆసక్తిగా విన్నారు.
ఈ సందర్భంగా AHTU సీఐ శ్రీ జి. ఈదురు బాషా మానవ అక్రమ రవాణా సమాజానికి తీవ్రమైన ముప్పు అని విద్యార్థినులకు వివరించారు. ఉద్యోగాలు, ఉన్నత విద్య, వివాహాలు లేదా ఇతర అవకాశాల పేరుతో వచ్చే తప్పుడు ప్రలోభాలకు యువతులు మోసపోకూడదని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన విద్యార్థినులను కోరారు.
మహిళలు తమ భద్రత కోసం శక్తి యాప్‌ను వినియోగించుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో 112 ఎమర్జెన్సీ సేవలు, 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్లను సద్వినియోగం చేసుకోవాలని సీఐ ఈదురు బాషా సూచించారు. మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీ ఎ. అబ్రహం సోషల్ మీడియా వినియోగం, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని విద్యార్థినులకు వివరించారు.
మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లా ప్రొటెక్షన్ అధికారి శ్రీమతి జి. సునీత మహిళల హక్కులు, ప్రభుత్వ రక్షణ వ్యవస్థలు, సంక్షేమ సేవలపై అవగాహన కల్పించారు. నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీ కె. రెడ్డప్ప విద్యార్థినులు విద్యతో పాటు వ్యక్తిగత భద్రతకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
కార్యక్రమంలో AHTU సిబ్బంది ఎస్.ఏ. అలీ, శక్తి కంట్రోల్ రూమ్ ఏ. నాగజ్యోతి, మహిళా పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుళ్లు సి.హెచ్. జేబ్, కె. నాగేష్ కుమార్, శక్తి టీమ్ సభ్యులు డబ్ల్యూపీసీ కె.వి. శైలజ, డబ్ల్యూపీసీ సి. ఇందిరా ప్రియదర్శిని, హెచ్‌సీ సి.వి. శివశంకర్ రెడ్డి, పీసీ బి. రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పోలీసు శాఖ ప్రజల్లో, ముఖ్యంగా మహిళలు, విద్యార్థినుల్లో భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తుందని పోలీస్ అధికారులు తెలిపారు.













