రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప : స్థానిక 22వ వార్డులో తెలుగుదేశం పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. వార్డు పరిధిలోని డీజే ఎలక్ట్రికల్ సప్లయర్స్ నిర్వాహకుడు మాబు హుస్సేన్, ఆయన కుటుంబ సభ్యులతో పాటు దాదాపు 50 ముస్లిం కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు.

మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ శేఖర్ యాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజా, మాజీ కౌన్సిలర్ జాఫర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నూతనంగా చేరిన వారికి వైఎస్సార్‌సీపీ నేతలు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచే ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీనేనని, వార్డు సమగ్రాభివృద్ధి కోసం ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నామని కొత్తగా చేరిన నాయకులు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ అధికారంలో లేకపోయినా క్లిష్ట పరిస్థితుల్లో ఎటువంటి లాభాపేక్ష లేకుండా తనపై, వైఎస్సార్‌సీపీ సిద్ధాంతాలపై నమ్మకంతో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వార్డులో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న మాజీ కౌన్సిలర్ జాఫర్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు.

రానున్న రోజుల్లో 22వ వార్డులో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఛైర్మన్ అభ్యర్థికి ఈ వార్డు నుంచే భారీ మెజార్టీ సాధ్యమవుతుందనే నమ్మకాన్ని రాచమల్లు వ్యక్తం చేశారు.

తదుపరి కూటమి ప్రభుత్వంపై రాచమల్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సంక్షేమ పథకాల హామీలను ప్రభుత్వం పూర్తిగా పక్కనపెట్టి అమలు చేయకుండా అటకెక్కించిందని ఆయన ఆరోపించారు.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్‌పై ఉన్న రోగిలా మారిందని, ఆ వెంటిలేటర్ తొలగిస్తే ఆ పార్టీ ఉనికే ఉండదని రాచమల్లు ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో మోసపూరిత విధానాల వల్ల వైఎస్సార్‌సీపీకి నష్టం జరిగినప్పటికీ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే పాలకులకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

అక్టోబర్‌లో చిన్నదినం, 2029లో పెద్దదినం తప్పదని, రానున్న రోజుల్లో ప్రలోభాలకు గురిచేసే కుట్రలను ప్రజలు తిప్పికొట్టి, సంక్షేమం, మౌలిక వసతులకు ప్రాధాన్యతనిచ్చే వైఎస్సార్‌సీపీకి మళ్లీ ప్రజలు పట్టం కడతారనే ధీమాను రాచమల్లు వ్యక్తం చేశారు.













