రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్:
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్
జిల్లాలో ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ తెలిపారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల వివరాలను ఆయన వెల్లడించారు.
ఆదివారం జరిగిన ప్రత్యేక తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మొత్తం 303 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్.పి తెలిపారు. ఈ కేసులపై కలిపి రూ. 72,899 జరిమానా విధించినట్లు వివరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఇలాంటి ప్రత్యేక డ్రైవులు కొనసాగుతాయని సూచించారు.
ద్విచక్రవాహనదారులు ప్రయాణించే ప్రతి సారి హెల్మెట్ ధరించడం ద్వారా తమ ప్రాణాలను తాము కాపాడుకోవచ్చని జిల్లా ఎస్.పి పేర్కొన్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడపడం చట్టవిరుద్ధమని, ఇలాంటి ఉల్లంఘనలపై ఎలాంటి సడలింపు ఉండదని స్పష్టం చేశారు.
కార్లలో ప్రయాణించే వారు కూడా తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని జిల్లా ఎస్.పి సూచించారు. ముందు సీటులో కూర్చునే వారు మాత్రమే కాకుండా, వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణికులు కూడా సీట్ బెల్ట్ ధరించాల్సిన అవసరం ఉందని ట్రాఫిక్ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయని ఆయన గుర్తుచేశారు.
రాంగ్ రూట్ డ్రైవింగ్ ప్రమాదకరమని జిల్లా ఎస్.పి హెచ్చరించారు. ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, రాంగ్ రూట్ డ్రైవింగ్ పై కఠిన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని పోలీసు శాఖ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి వాహనదారుడి బాధ్యతగా భావించాలని, పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నప్పుడు వారికి సహకరించాలని జిల్లా ఎస్.పి పిలుపునిచ్చారు. నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించుకోవచ్చని, కుటుంబాలకు ఆపదలు దూరం పెట్టవచ్చని ఆయన సూచించారు.













