రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప:- ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-2026) కార్యక్రమం భాగంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక ప్రచార దినాలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో నమోదు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
2026 ఆగస్టు 22, 23, 29, 30 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ ప్రత్యేక దినాల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు ప్రజలకు సేవలు అందించేందుకు అందుబాటులో ఉంటారని తెలిపారు.
ముసాయిదా ఓటర్ల జాబితా, సంబంధిత జాబితాలతో పాటు అవసరమైన 6, 7, 8, 8ఏ దరఖాస్తు ఫారాలు ప్రతి బూత్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఫారాల ద్వారా ఓటర్లకు దరఖాస్తుల స్వీకరణ, సందేహాల నివృత్తి, మార్గదర్శకత్వం వంటి సేవలను బూత్ స్థాయి అధికారులు అందిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.
18-19 సంవత్సరాల యువ ఓటర్లను పెద్దఎత్తున ఓటర్ల జాబితాలో నమోదు చేయడం ఈ ప్రత్యేక ప్రచార దినాల ప్రధాన లక్ష్యాలలో ఒకటిగా ఉందని డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. అలాగే, ముసాయిదా జాబితాలో నమోదు కాకుండా మిగిలిపోయిన అర్హులైన ఓటర్లను గుర్తించి చేర్చేందుకు ఈ ప్రత్యేక ప్రచార దినాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను ఆయన కోరారు.
ప్రత్యేక ప్రచార దినాలపై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలని, రాజకీయ పార్టీలకు ముందస్తుగా సమాచారం అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బూత్ స్థాయి అధికారులు స్వీకరించిన ప్రతి దరఖాస్తుపై భౌతిక పరిశీలన, స్థానిక విచారణ పూర్తి చేసి సంబంధిత ఎన్నికల నమోదు అధికారికి సమర్పించాలని ఆయన సూచించారు.
అలాగే, స్వీకరించిన దరఖాస్తుల వివరాలను రోజువారీగా నమోదు చేయడంతో పాటు, దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఓటర్ల జాబితా సక్రమంగా, సమగ్రంగా ఉండేందుకు ప్రతి స్థాయి అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని ఆయన సూచించారు.













