రాయలసీమ న్యూస్, కడప: సిద్ధవటం మండలం లింగంపల్లె సమీపంలోని పెన్నానదిలో ఈతకు వెళ్లిన యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనతో ప్రాంతంలో విషాదం నెలకొంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాపట్ల జిల్లా చెరకుపల్లె మండలం గొల్లపల్లె గ్రామానికి చెందిన వంగర జగదీశ్ కుమార్ (26) కడప పట్టణంలో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. గురువారం సెలవు కావడంతో ఐదుగురు స్నేహితులతో కలిసి లింగంపల్లె శివారులోని పెన్నానది తీరానికి వెళ్లాడు.
లింగంపల్లె పరిసరాల్లోని పంప్ హౌస్ వద్ద స్నేహితులతో కలిసి ఈతకు దిగిన జగదీశ్, కొంతసేపటికి కనిపించకుండా పోయాడు. సహచరులు గమనించి వెతికే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు.
కొంతసేపటి శ్రమ అనంతరం జగదీశ్ మృతదేహాన్ని బయటకు తీశారు. ప్రమాదవశాత్తు లోతైన నీటిలోకి వెళ్లి మునిగిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జగదీశ్ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. యువకుడి మరణంతో గొల్లపల్లె గ్రామంలో శోకసంద్రం నెలకొంది.













