రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కమలాపురం మండలం బైనపల్లె సమీపంలో లారీ కరెంటు స్తంభాన్ని ఢీకొనడంతో అక్కడ పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు.
పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం బైనపల్లె సమీపంలోని రహదారిపై లారీ వేగంగా వస్తుండగా అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఢీకొట్టిన ప్రభావంతో స్తంభం విరిగి లారీపై పడింది. ఈ సమయంలో లారీ డ్రైవర్ చంద్రకు గాయాలయ్యాయి.
గాయపడిన చంద్రను అక్కడున్న వారు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అనంతరం 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతున్నట్లు సమాచారం.
లారీ కరెంటు స్తంభాన్ని ఢీకొట్టిన వెంటనే ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్తంభం విరిగిపడడంతో విద్యుత్ తీగలు కూడా కిందపడ్డాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడటంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు.
సకాలంలో విద్యుత్ సరఫరా నిలిపివేయకపోతే లారీతో పాటు సమీపంలో ఉన్నవారికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉండేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది దెబ్బతిన్న స్తంభం, తీగలను పరిశీలించి మరమ్మతు పనులు ప్రారంభించారు.
ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమైందని ప్రాథమికంగా భావిస్తున్నారు. రహదారిపై వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, వేగం నియంత్రణలో ఉంచాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.













