రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా మైదుకూరులోని మండల సివిల్ సప్లై గోడౌన్లలో పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన సుబ్బరాయుడు మైదుకూరు పరిధిలోని గోడౌన్లను పర్యటించి తనిఖీలు నిర్వహించగా ఈ అవకతవకలు బయటపడ్డాయి.
గోడౌన్ల నుంచి మధ్యాహ్న భోజన పథకం కింద హాస్టళ్లకు పంపే బియ్యం బస్తాలను కొలతలు తగ్గించి అందిస్తున్నట్టు ఆయన గుర్తించినట్లు సమాచారం. విద్యార్థుల కోసం కేటాయించిన బియ్యంలో ఈ విధంగా అక్రమాలు జరగడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
గోడౌన్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయకుండా ఉద్దేశపూర్వకంగా నిలిపివేసినట్టు, అలాగే కెమెరాలను వారి కదలికలు కనిపించకుండా ఉండేలా అమర్చినట్టు డైరెక్టర్ గుర్తించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పర్యవేక్షణ వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నంగా ఈ చర్యలను అధికారులు పరిగణిస్తున్నారని తెలియజేశారు.
చెన్నూరు వద్ద ఉన్న ప్రధాన గోడౌన్లో కూడా డైరెక్టర్ తనిఖీలు నిర్వహించారు. అక్కడ ప్రొక్యూర్‌మెంట్ కేంద్రాల నుంచి తీసుకున్న నాసిరకం బియ్యం, పురుగు పట్టిన బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సరఫరా చేస్తున్నట్టు ఆయన గుర్తించినట్లు సమాచారం. ఈ బియ్యాన్ని కూడా మధ్యాహ్న భోజన పథకం వంటి సంక్షేమ పథకాల కోసం వినియోగించే అవకాశంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఉన్నత ఉద్దేశాలతో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న సమయంలో, జిల్లా సివిల్ సప్లై అధికారులు లాభాపేక్షతో విద్యార్థుల ఆరోగ్యాలను ప్రమాదంలోకి నెడుతున్నారని డైరెక్టర్ తీవ్రంగా విమర్శించినట్లు తెలిసింది. ఈ అక్రమాలపై బాధ్యులైన జిల్లా సివిల్ సప్లై అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌లను కలిసి పరిస్థితులను వివరించి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్టు డైరెక్టర్ చిట్టిబోయిన సుబ్బరాయుడు తెలిపినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనలపై ఉన్నత స్థాయి విచారణకు అవకాశం ఉన్నట్టు సమాచారం.













