వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు, దువ్వూరు ప్రాంతాల్లోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నియంత్రణ, ఆరోగ్యకర జీవనశైలిపై అవగాహన సదస్సు నిర్వహించారు. దువ్వూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి నుంచి మానసిక ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఎన్. కవితా ప్రసన్న హాజరయ్యారు.

విద్యార్థినులకు మానసిక ఆరోగ్య ప్రాధాన్యం, రోజువారీ జీవితంలో ఒత్తిడిని ఎలా గుర్తించాలి, ఎలా ఎదుర్కోవాలి వంటి అంశాలపై డాక్టర్ కవితా ప్రసన్న వివరణాత్మకంగా వివరించారు. చదువు, కుటుంబం, స్నేహితులు, సామాజిక పరిసరాల వల్ల ఏర్పడే ఒత్తిడిని సమతుల్యం చేసుకునే విధానాలపై ఆమె విద్యార్థినులకు అవగాహన కల్పించారు.

విద్యార్థినులు చదువుతో పాటు క్రీడలు, యోగా, ధ్యానం వంటి ఆరోగ్యకరమైన కార్యకలాపాలకు సమయం కేటాయించాలని సూచించారు. సెలవు రోజుల్లో కూడా టీవీ, సెల్‌ఫోన్ వినియోగాన్ని పరిమితం చేసుకోవాలని, ముఖ్యంగా YouTube, Instagram వంటి సామాజిక మాధ్యమాలు, అధిక సమయం తీసుకునే ఆన్‌లైన్ గేమ్స్‌కు దూరంగా ఉండాలని తెలిపారు.

ప్రతిరోజూ సుమారు ఎనిమిది గంటల నాణ్యమైన నిద్ర పొందడం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరమని డాక్టర్ కవితా ప్రసన్న పేర్కొన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు అధిక ఒత్తిడికి గురికాకుండా చదువును ప్రణాళికాబద్ధంగా కొనసాగించాలని సూచించారు. పరీక్షల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా నిరాశ చెందాల్సిన అవసరం లేదని, మరోసారి పరీక్షలు రాసి తమ లక్ష్యాలను సాధించవచ్చని విద్యార్థినులకు ధైర్యం చెప్పారు.

సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఒంటరిగా భరించకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన పెద్దలతో మాట్లాడాలని ఆమె విద్యార్థినులకు సూచించారు. తీవ్రమైన మానసిక ఒత్తిడి వ్యక్తి ఆలోచనా విధానం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, రోజువారీ పనితీరుపై ప్రభావం చూపవచ్చని వివరించారు. మానసిక ఆరోగ్య సమస్యలను తొలిదశలోనే గుర్తించి తగిన వైద్య సలహా, కౌన్సిలింగ్ మరియు అవసరమైన చికిత్స అందిస్తే పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు.

విద్యార్థుల్లో ప్రవర్తనలో గణనీయమైన మార్పులు, నిరంతర ఆందోళన, చదువుపై ఆసక్తి తగ్గడం, ఒంటరిగా ఉండటం, నిద్ర లేదా ఆహారపు అలవాట్లలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా నిపుణులను సంప్రదించాలని డాక్టర్ కవితా ప్రసన్న సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులు మానసిక ఆరోగ్యంపై అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు.

మానసిక సమస్యలు వచ్చినప్పుడు సంకోచం లేకుండా తగిన వైద్యులను సంప్రదించాలని, ముందస్తు జాగ్రత్తలతో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని డాక్టర్ కవితా ప్రసన్న విద్యార్థినులకు స్పష్టం చేశారు. మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి చికిత్స అందుబాటులో ఉందని, అవసరమైన వారు సోమవారం, బుధవారం, శుక్రవారం ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలోని OP సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు.

అవసరమైన వారికి ఉచితంగా కౌన్సిలింగ్, వైద్య సలహాలు, మందులు అందించే అవకాశం ఉందని డాక్టర్ కవితా ప్రసన్న చెప్పారు. అలాగే ప్రతి నెల మూడవ గురువారం దువ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు.

కార్యక్రమం అనంతరం దువ్వూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ హేమలత పాఠశాలలో విద్యార్థినులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థినులకు సమతుల్యమైన, పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. భోజనంలో నాణ్యత, పరిశుభ్రత, తాగునీటి భద్రత, వంటశాల పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలపై కూడా తగిన సూచనలు, సలహాలు అందించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మల్లేశ్వరి, ANM మాధవిలత, పాఠశాల ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది, విద్యార్థినీలు పాల్గొన్నారు.