రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా మైదుకూరు-పొరుమామిళ్ల రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. భూమాయపల్లె సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మైదుకూరుకు చెందిన P. వెంకటయ్య (50) అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
వెంకటయ్య ప్రతిరోజూ మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్య పనులకు స్కూటర్‌పై విధులకు వెళ్లేవాడని సహచరులు పేర్కొన్నారు. బుధవారం కూడా విధులకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని వారు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో రహదారిపై వాహనాల రాకపోక తక్కువగా ఉండటంతో ఘటన ఎలా జరిగిందన్న దానిపై స్పష్టత రాలేదని స్థానికులు చెప్పారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని వాహనాన్ని గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
వెంకటయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుటుంబంలో ఏకైక ఆదారంగా ఉన్న వెంకటయ్య ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మున్సిపల్ కార్యాలయంలో కూడా విషాద వాతావరణం నెలకొంది. సహచరులు, అధికారులు వెంకటయ్య మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉందని, వాహనాన్ని గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు. రహదారిపై ఉదయం వేళల్లో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని, ట్రాఫిక్ నియమాలను పాటించాలని వారు సూచించారు.













