రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని మైదుకూరు మండలం, నంద్యాలంపేట పంచాయతీ పరిధిలోని జి.వి. సత్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని వనిపెంట రేంజ్ అటవీశాఖ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నంద్యాలంపేట అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
పాఠశాల ప్రాంగణంలో వివిధ రకాల మొక్కలను నాటి, వాటి సంరక్షణపై విద్యార్థులకు అటవీశాఖ సిబ్బంది సూచనలు ఇచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది చురుకుగా పాల్గొనడంతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం, భాగస్వామ్యం కూడా లభించింది.

మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతపై విద్యార్థుల్లోనూ, గ్రామ ప్రజల్లోనూ అవగాహన పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అటవీశాఖ అధికారులు తెలిపారు. పాఠశాల స్థాయిలోనే పర్యావరణంపై చైతన్యం పెంపొందితే భవిష్యత్తు తరాలు ప్రకృతి సంరక్షణలో ముందుండగలవని వారు పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న అటవీశాఖ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు మొక్కల పెంపకం, నీటి సంరక్షణ, పచ్చదనం విస్తరణ అవసరంపై వివరించారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి, దాన్ని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వనిపెంట రేంజ్ అధికారి చలపతినాయుడు, హెడ్ మాస్టర్ జయప్రకాష్ రెడ్డి, తెలుగు ఉపాధ్యాయులు చంద్రశేఖర్ రెడ్డి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సురేఖ, ఏబీఓ సునీత, సీనియర్ అసిస్టెంట్ దీప్తి, పి.డబ్ల్యూ. ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.













