రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: దువ్వూరు: మండల కేంద్రమైన దువ్వూరు సమీపంలోని పాత దువ్వూరులో వెలసిన శ్రీ కోదండరామ స్వామి ఆలయ సన్నిధిలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో సుజయల శీల, ఆలయ అర్చకులు భూమరాజు నరసింహయ్య తెలిపారు.
ఆలయ అర్చకులు, ఆలయ ఈవో ఆధ్వర్యంలో ఈ సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. శ్రావణమాసం శుద్ధ నవమి, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం శ్రీ వరలక్ష్మి వ్రతం నిర్వహించే ఆనవాయితీ ఉందని అర్చకులు వివరించారు.
శ్రావణమాసంలో జరిగే శ్రీ వరలక్ష్మి వ్రతం అనాదిగా హిందూ మహిళలు నిర్వహించుకొనే విశేషమైన వ్రతమని, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా శ్రీ లక్ష్మీదేవిని ప్రార్థించుకొనే అతిముఖ్యమైన భక్తి కార్యక్రమమని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లు ప్రతి ఒక్కరు తమ ఇళ్లలో స్వయంగా చేసుకోవడం సాధ్యం కాకపోవచ్చని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో మహిళలందరికీ అవకాశం కల్పించే ఉద్దేశ్యంతో, ప్రతి ప్రాంతంలో దగ్గరలో ఉన్న దేవాలయాన్ని కేంద్రంగా చేసుకొని సామూహికంగా వరలక్ష్మి వ్రతం నిర్వహించాలని Hindu Dharmaparirakshana Trust ఆలోచనగా ఉందని వారు తెలిపారు.
ఆ ఆలోచనకు అనుగుణంగా పాత దువ్వూరులోని శ్రీ కోదండరామ స్వామి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో సుజయల శీల, అర్చకులు భూమరాజు నరసింహయ్య వివరించారు. దేవస్థానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక ద్వారా మహిళలందరూ కలిసి సామూహికంగా వ్రతాన్ని నిర్వహించేలా కార్యక్రమాన్ని రూపకల్పన చేసినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన మహిళలు తమ పేర్లను దేవస్థానం కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో ముందస్తుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సామూహిక వ్రతానికి ఎటువంటి ప్రవేశ రుసుము లేకుండా ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
వ్రతానికి సంబంధించిన వస్తువులు ప్రతి ఒక్కరు తమవంతుగా తెచ్చుకోవాలని, వ్రతంలో పాల్గొనే భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని అర్చకులు భూమరాజు నరసింహయ్య కోరారు.













