రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు మండలంలో గురువారం వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం పర్యటించింది. పలు గ్రామాల్లో పంటల సాగు పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించింది. రైతులతో సమావేశమై ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, పంటల స్థితిగతులపై వివరాలు తెలుసుకుంది.
ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు ఎల్ నినో పరిస్థితుల ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం, ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రైతులకు వివరించారు. ఈ నేపథ్యంలో పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కరువు పరిస్థితులను తట్టుకొనే పంటలను సాగు చేయడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు రైతులకు తెలియజేశారు. నీటి వినియోగాన్ని తగ్గించే పద్ధతులు, తక్కువ కాలంలో పండే పంటలు, పొడి పరిస్థితుల్లోనూ నిలబడగల రకాలను ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. పంటల మార్పిడి, నేల ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలపై కూడా అవగాహన కల్పించారు.
రైతులతో జరిగిన సమావేశంలో ప్రస్తుత సీజన్‌కు అనుకూలమైన ప్రత్యామ్నాయ పంటల సాగుపై శాస్త్రవేత్తలు సూచనలు చేశారు. విత్తనాల ఎంపిక, ఎరువుల వినియోగం, పురుగుమందుల వాడకంలో పాటించాల్సిన జాగ్రత్తలపై సలహాలు ఇచ్చారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో పంటల నిర్వహణలో మార్పులు చేసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.
ఈ పర్యటనలో ఊటుకూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన సైంటిస్ట్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సైంటిస్టులు సునీల్ కుమార్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ప్రొద్దుటూరు MAO వరహరి కుమార్, MEO రామ్మోహన్ రెడ్డి, BTM, VAAలు, మాజీ MPP రాఘవ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో భాగమయ్యారు.













