ప్రొద్దుటూరు:-భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయినా, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్ని కోల్పోయి 26 నెలలు అవుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోందని, గత 26 నెలలుగా ప్రజలు స్వేచ్ఛగా జీవించే పరిస్థితులు లేవని ఆయన ఆరోపించారు.

ప్రస్తుత రాష్ట్ర పాలకుల కంటే బ్రిటీష్ పాలకులే నయమని రాచమల్లు శివప్రసాదరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దోపిడీలు, జైళ్లు, అప్పులు తప్ప ప్రజలకు స్వాతంత్ర్యం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. పాలనలో అవినీతి, అక్రమాలు, అణచివేతలు పెరిగిపోతున్నాయని, ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

“మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లుగా రాష్ట్రంలో మూడు అత్యాచారాలు, ఆరు హత్యలు అన్న చందంగా పరిస్థితి నెలకొంది” అని రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన పాలకులు, గంజాయి, మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నారని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో పాలకులకు స్వేచ్ఛ ఉంది కానీ ప్రజలకు మాత్రం స్వేచ్ఛ లేదని ఆరోపించారు. ప్రజల హక్కులు, స్వేచ్ఛలను కాపాడాల్సిన బాధ్యత ఉన్నవారు, వాటిని కాలరాస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆరోపించారు. తన చేతిలోని రెడ్‌బుక్‌ను పక్కనపెట్టి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని పట్టుకుంటే తాను హర్షిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను పక్కనబెట్టి, వ్యక్తిగత అజెండాలతో పాలన సాగించడం ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు.

ప్రజలకు నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం రావాలంటే ప్రతి ఇంటి నుంచి ఒక మహాత్మాగాంధీ, ఒక భగత్‌సింగ్ పుట్టాల్సిన అవసరం ఉందని రాచమల్లు శివప్రసాదరెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని, ప్రజల్లో భయ వాతావరణం నెలకొన్నదని అన్నారు.

రాబోయే 2029 ఎన్నికల్లో ప్రజలు మహాత్మాగాంధీ, భగత్‌సింగ్ స్ఫూర్తితో తమ ఓటు హక్కును వినియోగించుకుని పాలకులకు తగిన సమాధానం చెప్పాలని రాచమల్లు శివప్రసాదరెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఓటు శక్తిని వినియోగించాలని ఆయన కోరారు.