రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు పట్టణంలోని సాయికుటీర్ రోడ్డులో బీటెక్ చదువుతున్న విద్యార్థిని శరణ్య (21) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనపై త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శేఖర్, లక్ష్మీదేవి దంపతులు ప్రొద్దుటూరు సున్నంబట్టివీధిలో పిండి మిషన్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమార్తె శరణ్య కర్నూల్‌లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. ఇటీవల కాలేజీకి రెండు నెలలపాటు సెలవులు ఇవ్వడంతో శరణ్య ఇంటికి వచ్చింది.
ఈ క్రమంలో శేఖర్, లక్ష్మీదేవి దంపతులు తమ పిండి మిషన్ వద్దకు వెళ్లి పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చారు. గది తలుపులు వేసుకొని లోపల ఉన్న శరణ్యను పలుమార్లు పిలిచినా స్పందించలేదు. దీంతో ఆమెకు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పక్కనే ఉన్న కిటికీ ద్వారా గదిలోకి చూడగా శరణ్య సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే తలుపులు పగులకొట్టి లోపలికి వెళ్లి శరణ్యను కిందకు దించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడికి చేరుకునే సరికి ఆమె మృతిచెందినట్లు విధులు నిర్వహిస్తున్న వైద్యుడు నిర్ధారించారు.
ఈ ఘటనతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువుల అబ్బాయితో తమ కుమార్తె చనువుగా ఉండేదని, ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకోవాలని తల్లి లక్ష్మీదేవి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు త్రీ టౌన్ సీఐ రామాంజనేయుడు తెలిపారు. శరణ్య ఆత్మహత్యకు గల నిజమైన కారణాలు వెలుగులోకి రావాల్సి ఉందని, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాల ఆధారంగా అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.













