రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటికి సత్వర పరిష్కారం చూపే లక్ష్యంతో నిర్వహిస్తున్న “కమిషనర్‌తో ముఖాముఖి” ఫోనింగ్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువగా పాలన అందుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ తెలిపారు.
జూలై 27, 2026 సోమవారం నుండి వరుసగా నాలుగు వారాలపాటు ప్రతి వారం నిర్వహించిన “కమిషనర్‌తో ముఖాముఖి” ఫోనింగ్ కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 71 ఫిర్యాదులు స్వీకరించినట్లు కమిషనర్ వివరించారు. ఈ ఫిర్యాదుల్లో ప్రధానంగా వీధిలైట్లు, మంచినీటి సరఫరా, పారిశుధ్యం, రోడ్లు, ఆక్రమణలు, ట్రాఫిక్ సమస్యలు, ఆవులు, కుక్కలు తదితర ప్రజా సమస్యలు ఉన్నాయని ఆయన తెలిపారు.
వీటిలో తక్షణమే పరిష్కరించగలిగే మంచినీరు, పారిశుధ్యం, వీధిలైట్లు, ట్రాఫిక్ తదితర అంశాలకు సంబంధించిన 30 సమస్యలను ఇప్పటికే పరిష్కరించినట్లు కమిషనర్ వెల్లడించారు. మిగిలిన ఫిర్యాదులపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించినట్లు పేర్కొన్నారు.
మిగిలిన ఫిర్యాదులను కూడా ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి, తక్షణమే అమలులోకి వచ్చే విధంగా అవసరమైన చర్యలు తీసుకునేందుకు మున్సిపల్ యంత్రాంగం కృషి చేస్తుందని కమిషనర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతతో స్వీకరించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు మున్సిపల్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నట్లు ఆయన వివరించారు.
ప్రజలు తమ సమస్యలను నేరుగా మున్సిపల్ యంత్రాంగం దృష్టికి తీసుకురావడానికి “కమిషనర్‌తో ముఖాముఖి” ఫోనింగ్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా కమిషనర్ దృష్టికి చేరడంతో, పరిష్కార ప్రక్రియ వేగవంతం అవుతోందని పురపాలక సంఘం వర్గాలు పేర్కొన్నాయి.
ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలో ప్రజా సేవలను మరింత మెరుగుపరచేందుకు ఇటువంటి కార్యక్రమాలను కొనసాగించే దిశగా మున్సిపల్ యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ వెల్లడించారు.













