కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం పేరు వినగానే ఒకప్పుడు వ్యాపార ధర్మం, నమ్మకానికి మారుపేరుగా నిలిచిన "బంగారు ప్రొద్దుటూరు" గుర్తుకొచ్చేది. అయితే ఇటీవల కొందరు అక్రమార్కులు చేస్తున్న మోసపూరిత వ్యాపారాల వల్ల ఈ పట్టణ ప్రతిష్టకు గండిపడుతున్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సెల్ ఫోన్ వ్యాపారంలో జరుగుతున్న మోసాలు బయటపడటంతో, బయట ప్రాంతాల ప్రజలు "ప్రొద్దుటూరులో ఏమైనా కొనొచ్చు గానీ సెల్ ఫోన్లు మాత్రం కొనకూడదు" అనే స్థాయికి చేరుకున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.

ఇందుకు నిదర్శనంగా ప్రొద్దుటూరులోని పాత చేపల మార్కెట్, ప్రస్తుత మున్సిపల్ కాంప్లెక్స్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ సెల్ పాయింట్‌లో వెలుగుచూసిన నకిలీ ఐఫోన్ మోసం సంచలనం రేపుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఒక యువకుడు ఐదు నెలల క్రితం ఆ సెల్ పాయింట్‌లో రూ.51 వేల విలువైన ఐఫోన్ కొనుగోలు చేశాడు. ఐఫోన్‌లలో నకిలీలు ఉండవని నమ్మకంతో నగదు చెల్లించి ఫోన్ తీసుకున్నాడు.

ఇటీవల అత్యవసర ఆర్థిక అవసరం రావడంతో ఆ యువకుడు ఆ ఫోన్‌ను అమ్మేందుకు హైదరాబాద్‌లోని అధికారిక ఐఫోన్ కేర్ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడ సిబ్బంది ఫోన్‌ను పరిశీలించి షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. ఇది అసలైన ఐఫోన్ కాకుండా డూప్లికేట్ ఫోన్ అని, దీనికి మార్కెట్లో విలువ లేదని స్పష్టం చేయడంతో యువకుడు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.

ఈ నేపథ్యంలో బాధితుడు వెంటనే ప్రొద్దుటూరుకు చేరుకుని, తాను ఫోన్ కొనుగోలు చేసిన సెల్ పాయింట్ యజమానిని కలిసి విషయం వివరించాడు. ఫోన్ నకిలీగా తేలిందని, చెల్లించిన రూ.51 వేల రూపాయలు తిరిగి ఇవ్వాలని కోరాడు. అయితే ఆ వ్యాపారి గత మూడు నెలలుగా బాధితుడిని తిప్పికొడుతూ కాలయాపన చేయడమే తప్ప సొమ్ము తిరిగి ఇవ్వడానికి నిరాకరించినట్లు సమాచారం.

చివరకు విసిగిపోయిన బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. పోలీసులు సెల్ పాయింట్ యజమానిని స్టేషన్‌కు పిలిపించి విచారించగా, ఎస్సై ఎదుట అతడు అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు.

సార్ ఈ ఫోన్‌ను నేను చెన్నై సండే మార్కెట్‌లో తక్కువ ధరకు కొని తీసుకువచ్చాను.

అని చెప్పడంతో పోలీసులే ఆశ్చర్యానికి గురైనట్లు తెలిసింది.

పోలీస్ స్టేషన్‌లో జరిగిన విచారణ అనంతరం బాధితుడి డబ్బులు తిరిగి ఇవ్వాలని, విషయం సర్దుబాటు చేసుకోవాలని పోలీసులు వ్యాపారికి సూచించినట్లు తెలుస్తోంది. అయితే స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యాపారి తన అసలు స్వరూపం చూపించాడు. బాధితుడిని బెదిరింపులకు గురి చేశాడు.

నన్నే పోలీస్ స్టేషన్‌కు పిలిపిస్తావా.. నీకు ముందుగా ఇస్తానన్న రూ.30,000 కూడా ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో.

అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు బాధితుడు తెలిపాడు.

ఈ ఘటనతో ప్రొద్దుటూరులో నకిలీ ఫోన్లను ఒరిజినల్‌గా నమ్మించి విక్రయిస్తున్న రాకెట్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మోసాల వెనుక ఎంతమంది ఉన్నారు, ఇలాంటి ముఠాలపై పోలీసులు ఎంతవరకు కఠిన చర్యలు తీసుకుంటారు అన్న ప్రశ్నలు వినియోగదారుల్లో తలెత్తుతున్నాయి. బాధితుడికి న్యాయం జరిగి, సంబంధిత వ్యాపారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పుడే "బంగారు ప్రొద్దుటూరు" అనే నమ్మకం తిరిగి నిలబడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.