రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు: ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు బస్సులను ప్రయాణికుల రవాణా కోసం కాకుండా వాణిజ్య సరుకుల తరలింపుకు వినియోగిస్తూ నిబంధనలను బేఖాతరు చేస్తున్న నేపథ్యంలో రవాణాశాఖ అధికారులు కఠిన చర్యలకు దిగారు. ప్రయాణికుల భద్రతను పక్కన పెట్టి బస్సుల్లో యథేచ్ఛగా వాణిజ్య సరుకులను రవాణా చేస్తున్న అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టి ఉక్కుపాదం మోపారు.

ప్రైవేటు బస్సుల ద్వారా జరుగుతున్న ఈ అక్రమ రవాణాపై "సిండికేట్ దందా ఆగేది ఎప్పుడు?" '
ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు ఇన్చార్జ్ ఆర్టీవో నారాయణ నాయక్ నేతృత్వంలో అధికారులు సోమవారం, మంగళవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు భారీ జరిమానాలు విధించారు. AP 16 TG 6023 నంబరు గల బస్సుకు రూ. 29,400, AP 01 TT 3179 నంబరు గల బస్సుకు రూ. 27,000 జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. అలాగే AP 39 TH 2916 నంబరు గల మరో బస్సుపైనా జరిమానా విధించారు.
పత్రికల్లో ప్రచురితమైన ఫొటోలు, ఆధారాల ఆధారంగా సెవెన్ హిల్స్ , ఇందు ట్రావెల్స్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. సమాధానాలు సంతృప్తికరంగా లేకపోతే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు రవాణాశాఖ అధికారులు స్పష్టం చేశారు.
మంగళవారం ఉదయం స్థానిక ఆర్టీవో కార్యాలయంలో ప్రొద్దుటూరు పరిధిలోని ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలతో రవాణాశాఖ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అక్రమ సరుకు రవాణాపై హెచ్చరికలు జారీ చేసి, నిబంధనలు పాటించాల్సిన అవసరాన్ని వివరించారు.
ప్రైవేటు బస్సుల్లో వాణిజ్య సరుకుల రవాణా పూర్తిగా నిషేధం. ఇది చట్టరీత్యా నేరం. ప్రైవేట్ బస్సులను కేవలం ప్రయాణికుల రవాణా కోసమే వినియోగించాలి. అక్రమ సరుకు రవాణాకు అడ్డంగా మార్చకూడదు. బస్సుల బాడీపై, స్టోరేజ్ ప్రాంతాల్లో సరుకులు ఎక్కించరాదు. అక్రమ రవాణాకు ఉపయోగపడుతున్న అదనపు గ్రిల్స్‌ను తక్షణమే తొలగించాలి. మాటిమాటికీ నిబంధనలు ఉల్లంఘిస్తే కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా పర్మిట్లను రద్దు చేస్తాం.
ప్రైవేటు బస్సుల్లో అక్రమంగా సరుకులు రవాణా చేస్తూ ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించేలా వ్యవహరిస్తున్న ఘటనలు కనిపిస్తే ప్రజలు నేరుగా రవాణాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్‌కు కూడా సమాచారం అందించాలని సూచించారు.
తక్కువ ధరల పేరుతో ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడే బస్సులను ఆశ్రయించకుండా, భద్రతకు ప్రాధాన్యమిచ్చే RTC సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. రవాణాశాఖ తీసుకున్న ఈ కఠిన చర్యలతో ప్రైవేటు ట్రావెల్స్ అక్రమ దందాకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుందో లేదో చూడాల్సి ఉంది.













