రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు: రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు గట్టిగా ఎండగట్టాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఆర్. రమేష్ యాదవ్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ భేటీ సందర్భంగా త్వరలో జరగబోయే అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల్లో ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావిస్తూ పోరాటం కొనసాగించాలని జగన్ సూచించినట్లు ఆర్. రమేష్ యాదవ్ తెలిపారు. ప్రజలపై భారంగా మారుతున్న ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలపై సభ వేదికగా నిర్దాక్షిణ్యంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు.
ప్రత్యేకంగా డీఎస్సీ-2025 నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలపై పూర్తి వివరాలు సేకరించి, శాసనమండలి వేదికగా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా గళం విప్పాలని జగన్ స్పష్టం చేసినట్లు రమేష్ యాదవ్ పేర్కొన్నారు. నియామకాల ప్రక్రియలో జరిగిన అనుమానాస్పద చర్యలు, పారదర్శకత లోపాలపై సమగ్ర సమాచారం సిద్ధం చేసి, సభలో బలమైన వాదనలు వినిపించాలనే దిశగా పార్టీ అధినేత సూచనలు చేసినట్లు ఆయన తెలిపారు.
డీఎస్సీ-2025తో పాటు రాష్ట్రంలో వివిధ రంగాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై కూడా మండలిలో సభ్యులు గట్టిగా నిలదీయాలని జగన్ సూచించినట్లు ఎమ్మెల్సీ ఆర్. రమేష్ యాదవ్ వివరించారు. ప్రజా ధనం దుర్వినియోగం, టెండర్లు, కాంట్రాక్టులు, సంక్షేమ పథకాల అమలులో వస్తున్న లోపాలపై నిరూపణలతో కూడిన చర్చకు సిద్ధం కావాలని జగన్ సూచించినట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడం, వారి సమస్యలను శాసనసభల వేదికగా బలంగా వినిపించడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా భావిస్తోందని, ఆ దిశగా సభ్యులు చురుకుగా వ్యవహరించాలని జగన్ దిశానిర్దేశం చేసినట్లు రమేష్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సూచనల మేరకు రానున్న అసెంబ్లీ, మండలి సమావేశాలకు వైసీపీ సభ్యులు సన్నద్ధం అవుతున్నట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి.













