కళ్ళాపి పౌడర్ యూనిట్లపై సంయుక్త దాడులు:

వైఎస్సార్ కడప జిల్లాలో ప్రమాదకర రసాయనాలతో తయారవుతున్న కళ్ళాపి పౌడర్ (సాధారణంగా పేడ నీళ్ల పౌడర్) తయారీ యూనిట్లపై జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సంయుక్త దాడులు నిర్వహించారు. 07.07.2026న ప్రొద్దుటూరు ప్రాంతంలో జరిగిన ఈ దాడుల వివరాలను జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

వైఎస్సార్ కడప జిల్లా పోలీసు శాఖ, వివిధ అమలు మరియు నియంత్రణ శాఖల సమన్వయంతో ప్రొద్దుటూరు ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కళ్ళాపి పౌడర్ తయారీ యూనిట్లపై సంయుక్త తనిఖీలు చేపట్టింది. ఈ దాడులు శ్రీ సౌభాగ్య కుంకుమ ఇండస్ట్రీ గోడౌన్ (మదూర్ రోడ్, ప్రొద్దుటూరు పట్టణం), కామధేను కుంకుమ ఇండస్ట్రీ (మండి బజార్, కొత్తపల్లి గ్రామం, ప్రొద్దుటూరు మండలం), శ్రీ మహాలక్ష్మి కుంకుమ/పసుపు ఇండస్ట్రీ (కొత్తపల్లి గ్రామం, ప్రొద్దుటూరు మండలం), చంద్రిక ట్రేడర్స్ (కొత్తపల్లి గ్రామం, ప్రొద్దుటూరు మండలం), శ్రీ దేవి–భూదేవి కలాపి ఇండస్ట్రీ (ఎంఎస్ ట్రేడర్స్, ఎంజీ ఆటోనగర్, కొత్తపల్లి గ్రామం, ప్రొద్దుటూరు మండలం)లలో నిర్వహించబడ్డాయి.

సంజుక్త తనిఖీ బృందంలో శ్రీ డి. ఉదయ భాస్కర్ రాజు (తహసీల్దార్, ప్రొద్దుటూరు), శ్రీమతి సుధా కురుబ (పర్యావరణ ఇంజనీర్, Andhra Pradesh Pollution Control Board, ప్రాంతీయ కార్యాలయం, కడప), శ్రీ పి. చిన్నారావు (డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, కడప), శ్రీ పి. బసివిరెడ్డి (Assistant District Fire Officer, ప్రొద్దుటూరు), శ్రీ పి. శ్రీనివాసరెడ్డి (ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, Vigilance and Enforcement, కడప), శ్రీ జి. లక్ష్మణ కుమార్ (వ్యవసాయ అధికారి, Vigilance and Enforcement, కడప), ప్రొద్దుటూరు పోలీసు, ప్రొద్దుటూరు మున్సిపల్ సిబ్బంది మరియు APSPDCL అధికారులు పాల్గొన్నారు.

కళ్ళాపి పౌడర్, సాధారణంగా పేడ నీళ్ల పౌడర్‌గా పిలవబడే ఈ రసాయన పొడిని నీటిలో కలిపి ముగ్గు వేయడానికి ముందు నేలపై చల్లడం ఆనవాయితీ. తక్కువ ధర, సులభ లభ్యత కారణంగా అనేక కుటుంబాలు సాంప్రదాయ ఆవు పేడకు బదులుగా దీన్ని వినియోగిస్తున్నాయి. అయితే కొందరు తయారీదారులు అత్యంత ప్రమాదకరమైన, విషపూరిత రసాయనాలను ఉపయోగించి ఈ పౌడర్ తయారు చేస్తున్నట్లు పోలీసు శాఖ దృష్టికి రావడంతో ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్రమైన ముప్పు ఏర్పడుతోందని అధికారులు పేర్కొన్నారు.

ఈ ఉత్పత్తి ఇళ్లలో సులభంగా నిల్వ ఉంచబడటం వల్ల ఆత్మహత్యలు, ప్రమాదవశాత్తు విషప్రయోగాలకి కారణమవుతున్నదని గుర్తించారు. ముఖ్యంగా కుటుంబ, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్న కొందరు మహిళలు కళ్ళాపి పౌడర్ సేవించి ఆత్మహత్యాయత్నాలకు పాల్పడిన ఘటనలు నమోదయ్యాయి. 01.01.2025 నుండి 06.07.2026 వరకు వైఎస్సార్ కడప జిల్లాలో కళ్ళాపి పౌడర్ సేవించడం వల్ల మొత్తం 19 మంది ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు అధికారిక వివరాలు వెల్లడించబడ్డాయి.

తనిఖీల సందర్భంగా ఆయా యూనిట్లలో Auramine-O అనే మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరమైన ప్రమాదకర రసాయనాన్ని కలిపి కళ్ళాపి పౌడర్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. పర్యావరణ, భద్రతా ప్రమాణాలను పాటించకుండా పరిశ్రమలను నిర్వహించడం, తప్పనిసరిగా ఉండాల్సిన అగ్నిమాపక భద్రతా పరికరాలు లేకపోవడం, Water (Prevention and Control of Pollution) Act, 1974 సెక్షన్ 25, Air (Prevention and Control of Pollution) Act, 1981 సెక్షన్ 21 ప్రకారం తప్పనిసరిగా పొందవలసిన అనుమతులు లేకుండా పరిశ్రమలను నడపడం వంటి ఉల్లంఘనలు బయటపడ్డాయి.

ఈ ఉల్లంఘనల ఆధారంగా పై ఐదు తయారీ యూనిట్లను మధ్యవర్తుల సమక్షంలో పంచనామా నిర్వహించి సీజ్ చేసి సీల్ చేశారు. అదేవిధంగా తహసీల్దార్, ప్రొద్దుటూరు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయా పరిశ్రమల యజమానులపై సంబంధిత చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసే చర్యలు ప్రారంభించబడ్డాయి.

వైఎస్సార్ కడప జిల్లా పోలీసు శాఖ ప్రజలను కళ్ళాపి పౌడర్ కొనుగోలు, వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అనుమతులు పొందని తయారీదారుల ఉత్పత్తులను వినియోగించవద్దని విజ్ఞప్తి చేసింది. అక్రమంగా కళ్ళాపి పౌడర్ తయారీ, నిల్వ లేదా విక్రయం జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన పక్షంలో సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందించి చట్టపరమైన చర్యలకు సహకరించాలని జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు సూచించారు.