ప్రొద్దుటూరు: ఖాదరాబాద్ ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం అమలు, ఉద్యోగుల ధృవీకరణ పత్రాలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై విద్యాశాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ మేరకు డిప్యూటీ ఈఓ శివ ప్రసాద్ సోమవారం పాఠశాలను సందర్శించి సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఆగస్టు 14న ‘పసిడి అక్షరాలు’ వారపత్రిక ఎడిటర్ టప్పా షాకీర్ హుస్సేన్, National Human Rights Anti Corruption and Anti Crime Bureau of India నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆరికొండ ప్రతాప్ కుమార్ కలిసి డిప్యూటీ ఈఓ శివ ప్రసాద్‌కు పాఠశాలలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో విద్యార్థుల హాజరు నమోదు, మధ్యాహ్న భోజన పథకం లబ్ధిదారుల సంఖ్య, ఉద్యోగుల కుల ధృవీకరణ పత్రాలపై అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.

డిప్యూటీ ఈఓ నిర్వహించిన పరిశీలనలో పాఠశాల రికార్డుల ప్రకారం మదరసాలో చదువుతున్నట్లు చూపించిన 39 మంది విద్యార్థుల పేర్లు ఇక్కడి పాఠశాల రికార్డుల్లో కూడా ఉన్నట్లు తేలింది. అయితే ఆ విద్యార్థులు వాస్తవానికి పాఠశాలకు హాజరు కావడం లేదని నిర్ధారించుకున్న అధికారులు, వారి పేర్లను తక్షణమే పాఠశాల హాజరు రిజిస్టర్లు, ఇతర రికార్డుల నుంచి తొలగించాలని హెడ్ మాస్టర్‌కు డిప్యూటీ ఈఓ ఆదేశాలు జారీ చేశారు.

అదే విధంగా మధ్యాహ్న భోజన పథకం కింద చూపిస్తున్న లబ్ధిదారుల సంఖ్యలోనూ ఈ 39 మంది విద్యార్థుల పేర్లను తగ్గించాలని స్పష్టంగా సూచించారు. ఈ మేరకు హెడ్ మాస్టర్‌కు అధికారిక నోటీసులు అందజేసినట్లు విద్యాశాఖ వర్గాలు తెలియజేశాయి.

ఇక పాఠశాలలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు తప్పుడు కుల ధృవీకరణ పత్రాలతో ఉద్యోగాలు పొందినట్లు వచ్చిన ఆరోపణలపై కూడా అధికారులు దృష్టి సారించారు. ఈ అంశంపై సంబంధిత శాఖలు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు.

ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకతకు భంగం కలగకుండా చూడాలని, విద్యార్థుల హక్కులు, ప్రయోజనాల రక్షణ కోసం ఉన్నతాధికారులు పాఠశాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు విద్యాశాఖ వర్గాలు సూచిస్తున్నాయి.