ప్రొద్దుటూరు మండలంలోని కొత్తపల్లె గ్రామ పంచాయతీలో శనివారం ఉదయం నిర్వహించిన సామాజిక శంఖారావం కార్యక్రమం సందర్భంగా గ్రామస్థులు, గ్రామీణ పేదలు, దళితుల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 24న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం ప్రొద్దుటూరు మండల కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు.

తరువాత వ్యవసాయ కార్మిక సంఘం ప్రొద్దుటూరు మండల అధ్యక్షులు పాలజీ శేఖర్, కార్యదర్శి గుర్రం డేవిడ్‌లు మాట్లాడుతూ, గత నెల రోజులుగా సామాజిక శంఖారావం పేరుతో జిల్లాలో గ్రామీణ పేదల వాడలు, దళిత పేటల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నాయకులు మండలాలు, గ్రామాలు, పట్టణ వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను సేకరించామని తెలిపారు.

భూమి లేని ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల చొప్పున సాగు భూమి, ఇళ్ల స్థలాలు, పట్టాలు కల్పించాలని, పక్కా గృహాల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని, బ్యాక్లాగ్ పోస్టులను తక్షణం భర్తీ చేయాలని కోరారు.

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జిల్లాలో సుమారు ఐదువేల ఎకరాల భూమిని దళితులకు జెడ్.హెచ్.డి క్రింద కేటాయించినప్పటికీ, గత 40 సంవత్సరాలుగా సాగు చేస్తున్న దళిత రైతులకు ఇప్పటికీ పట్టాలు ఇవ్వలేదని, వారికి తక్షణం పట్టాలు జారీ చేసి, ఆన్లైన్ రైతు భరోసా వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

కూటమి ప్రభుత్వం మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఇప్పటికీ అమలు చేయలేదని, ఆ వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

పై సమస్యల పరిష్కారం కోసం ఈనెల 24వ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాకు గ్రామీణ పేదలు, దళితులు పెద్ద ఎత్తున తరలిరావాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి నోవా, కమిటీ సభ్యులు సుజాత, రమణమ్మ, లక్ష్మీ, రాజి, భాను, మేరీ, సన తదితరులు పాల్గొన్నారు.