ప్రొద్దుటూరు: దేశంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సంస్థలు మత విద్వేషాలను రెచ్చగొడుతూ కొనసాగిస్తున్న కుల, మత రాజకీయాలకు తక్షణమే ముగింపు పలకాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీఖాన్ డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రొద్దుటూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు.

ఉత్తరాఖండ్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన రామ్‌లీలా మైదాన ప్రాంతాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు శుద్ధి చేయడం అత్యంత హేయమైన చర్యగా అలీఖాన్ అభివర్ణించారు. ఖర్గే దళితుడు కావడమే కారణంగా ఆ ప్రాంతాన్ని శుద్ధి చేసినట్లు భావన కలిగించేలా ఈ చర్య జరిగిందని, దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో కుల, మత విభేదాలను పెంచే విధానాలను అవలంబిస్తోందని అలీఖాన్ ఆరోపించారు. దళితులు, బలహీన వర్గాల పట్ల వివక్ష చూపే ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్యవాదులు, సామాజిక న్యాయాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.

దేశంలో యువత, నిరుద్యోగులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని అలీఖాన్ డిమాండ్ చేశారు. ప్రజల అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే కేంద్రం ఇలాంటి కుల, మత వివాదాలను తెరపైకి తీసుకువస్తోందని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలు, మతాలు, వర్గాలను సమానంగా గౌరవిస్తుందని, దేశంలో ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, లౌకిక విలువలను కాపాడేందుకు నిరంతరం పోరాడుతుందని అలీఖాన్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో దేశ ప్రజలు బీజేపీ పాలనకు తగిన సమాధానం చెబుతారని, ప్రజలు కోరుకునే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుందనే ధీమా తనకు ఉందని ఆయన పేర్కొన్నారు.