ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరును లక్ష్యంగా పెట్టుకొని ప్రొద్దుటూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో “స్వచ్చ సంకల్ప దీక్ష” కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రజల సహకారంతో పట్టణాన్ని ప్లాస్టిక్ మాలిన్యాల నుంచి పూర్తిగా విముక్తం చేయాలని పురపాలక సంఘం సంకల్పించింది.

ప్రజా ఆరోగ్య రక్షణ, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని భవితరాల పిల్లలు, ప్రొద్దుటూరు పిల్లలు ఆరోగ్యవంతమైన సమాజంలో జీవించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పట్టణంలో పారిశుధ్య నిర్వహణను సక్రమంగా అమలు చేయడం, ప్రజాధనాన్ని సమర్థవంతంగా వినియోగించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించడం ఈ దీక్ష ప్రధాన ఉద్దేశ్యాలుగా పురపాలక సంఘం పేర్కొంది.

80వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఆగస్టు 15న ఉదయం 10 గంటలకు అనిబిసెంట్ మునిసిపల్ హై స్కూల్ మైదానంలో వేలాది మంది పాల్గొనేలా స్వచ్చ సంకల్ప దీక్షకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు నంద్యాల వరదరాజులరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ప్రొద్దుటూరు పట్టణ ప్రజలతో కలిసి ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుకు జనసంకల్పం చేయించనున్నారు.

ఈ మహోన్నత కార్యక్రమంలో పురజనులు, ప్రజా ప్రతినిధులు, ప్రజా నాయకులు, అడ్విసోరీ కమిటీ సభ్యులు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, వారి సిబ్బంది, పౌరసంఘాల ప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు, దుకాణదారులు, వర్తక వ్యాపారులు, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొనాలని పురపాలక సంఘం ఆహ్వానించింది.

స్వచ్చ సంకల్ప దీక్షను విజయవంతం చేయడం ద్వారా ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుకు తమ వంతు సహకారం అందించాలని ప్రజలను పురపాలక సంఘం కోరింది. ఈ కార్యక్రమం ద్వారా పట్టణంలో ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన పెంపొందించి, ప్రత్యామ్నాయ పర్యావరణ హిత పద్ధతులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో అధికారులు ముందుకు వస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రొద్దుటూరు పురపాలక సంఘం కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ (MBA, LLM), మాజీ సైనికుడు, తమ ఆహ్వానాన్ని మన్నించి అందరూ హాజరై స్వచ్చ సంకల్ప దీక్షను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమానికి సంబంధించిన వివరాల కోసం ఆయనను 7675924666, 9849905863 నంబర్లలో సంప్రదించవచ్చని పురపాలక సంఘం తెలిపింది.