ప్రొద్దుటూరు: ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి పేద కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చాలని బీజేపీ ప్రొద్దుటూరు నగరం-1 అధ్యక్షుడు వంకదార నరేంద్రరావు కోరారు. సోమవారం ఈ విషయమై ఆయన బీజేపీ నాయకులతో కలిసి మున్సిపాలిటీకి వెళ్లి అధికారులకు వినతిపత్రం అందజేశారు.

తరువాత మీడియాతో మాట్లాడిన నరేంద్రరావు, ప్రొద్దుటూరు పట్టణంలో సుమారు 23 వేల ఇళ్లు మంజూరైనప్పటికీ అనేక ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లోనే నిలిచిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. లబ్ధిదారులు తమ వంతుగా డబ్బులు ఖర్చు చేసినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిర్మాణాలు పూర్తి చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

అసంపూర్తిగా ఉన్న ఇళ్లను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవి త్వరగా పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పూర్తయిన గృహాలు, నిర్మాణంలో ఉన్న గృహాలకు రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, వీధి దీపాలు వంటి కనీస మౌలిక వసతులను వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు.

పేదల సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నరేంద్రరావు సూచించారు. రాజకీయాలకు అతీతంగా పేదల సంక్షేమం కోసం ఈ సమస్యను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు.