కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంగణంలో ఆటో డ్రైవర్ల ఆగడాలు రోజురోజుకు పెచ్చరిల్లుతున్నాయి. వారి అరాచకాలు ప్రయాణికులతో పాటు ఆర్టీసీ సిబ్బందికి తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి పోరు పడలేక ఎవరూ నోరు విప్పలేని పరిస్థితి నెలకొనడంతో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది.

పాత బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులను ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టడం అక్కడి ఆటో డ్రైవర్లకు నిత్యకృత్యంగా మారింది. బస్సు దిగిన వెంటనే ప్రయాణికుల లగేజీ బ్యాగులను బలవంతంగా లాక్కొని తమ ఆటోల్లో ఎక్కించుకోవడం, వారు అడిగినంత ఛార్జీలు చెల్లించకపోతే వారిపై దౌర్జన్యానికి దిగడం తరచూ జరుగుతోందని ప్రయాణికులు చెబుతున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లతోనూ వీరు తరచూ గొడవలకు దిగుతూ బస్సుల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, ఆటో డ్రైవర్లలో కొంతమంది మద్యం మత్తులో మరింత రెచ్చిపోతున్నారని స్థానికులు అంటున్నారు. మద్యం సేవించి ఒంటరిగా బస్సు దిగే మహిళలతో అసభ్యంగా మాట్లాడడం, వారిని భయభ్రాంతులకు గురిచేయడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయనే తీవ్ర ఆరోపణలు వెలువడుతున్నాయి. దీంతో మహిళా ప్రయాణికులు పాత బస్టాండ్ ప్రాంతంలో భయంతో ప్రయాణాలు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు.

ఈ సమస్యపై ప్రొద్దుటూరు ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే పలుమార్లు ఆటో డ్రైవర్లను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి, నియమ నిబంధనలు వివరించినప్పటికీ వారిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ట్రాఫిక్ పోలీసుల హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా, వారి సూచనలను పట్టించుకోకుండా ఆటో డ్రైవర్లు వ్యవహరిస్తున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

ఇటీవల ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రత్యేక చొరవతో పాత బస్టాండ్‌ను సుందరీకరించి, ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించారు. ప్రయాణికుల భద్రత కోసం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ పోలీసులను విధుల్లో నియమించారు. ఎండనక, వాననక పోలీసులు శ్రమిస్తున్నప్పటికీ, ఆటో డ్రైవర్లు వారి ఆదేశాలను పట్టించుకోకుండా, కొన్నిసార్లు పోలీసులతోనే వాగ్వాదాలకు దిగుతున్నట్లు సమాచారం.

ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ప్రయాణికుల సౌకర్యార్థం చేపడుతున్న చర్యలకు ఆటో డ్రైవర్ల ఈ విధమైన ప్రవర్తన మచ్చ తెస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. ఈ అరాచకాలను అణచివేయాలంటే కడప నుంచి ప్రత్యేక పోలీస్ బలగాలను రంగంలోకి దింపాలా, లేక ప్రొద్దుటూరు ట్రాఫిక్ సీఐ భాస్కర్ స్వయంగా కఠిన చర్యలు తీసుకోవాలా అన్నది పట్టణంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా అధికారులు తక్షణమే స్పందించి, ఆటో డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.