ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అవినీతి, అవ్యవస్థలు బహిరంగ రహస్యంగా మారిపోయాయని స్థానికంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో జరుగుతున్న గుంతల పనులు, కుళాయి కనెక్షన్ల మంజూరు, టెండర్ల కేటాయింపుల చుట్టూ లక్షల రూపాయల కుంభకోణం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ పాలనలో పారదర్శకత రావాలని, సామాన్యులకు సేవలు సక్రమంగా అందాలని ప్రజలు కోరుకుంటున్న తరుణంలో, కొందరు కింది స్థాయి ఉద్యోగుల ఆగడాలు వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిబంధనల ప్రకారం ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇద్దరు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల బాధ్యతలు కొత్తగా కుళాయి కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి, ప్రధాన పైప్‌లైన్ నుంచి కనెక్షన్ ఇవ్వడానికి అవసరమైన గుంతలు తవ్వడం, ఆ పనులను పర్యవేక్షించడం. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని ఆరోపణలు ఉన్నాయి. తెల్లవారగానే మున్సిపల్ కార్యాలయంలో నామమాత్ర హాజరు నమోదు చేసుకుని, అనంతరం స్థానిక టీ అంగళ్ల వద్ద, టిఫిన్ సెంటర్లలో కూర్చొని అసలు వ్యవహారాలు నడిపే వారిగా వీరి పేర్లు వినిపిస్తున్నాయి.

ఏ పనిని ఎవరికి కేటాయించాలి, ఏ టెండర్ ఎవరికి దక్కేలా చూడాలి, ఆ పనులను తమ పరిధిలో ఉన్న వ్యక్తులకు ఎలా మళ్లించుకోవాలి, ఏ అధికారికి ఎంత మేర ‘అమ్యాన్యాలు’ అందితే ఫైళ్లు కదులుతాయన్న దానిపై ఈ ఇద్దరు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు అనధికారికంగా చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గుంతల పనుల పేరుతో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తూ, కుళాయి కనెక్షన్ల నుంచి ప్రారంభమై లక్షల రూపాయల విలువైన పనుల వరకు తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ వ్యవహారాల వెనుక ఒక ఫేక్ కాంట్రాక్టర్‌గా పేరొందిన బంగారు అనే వ్యక్తి కీలక పాత్ర పోషిస్తున్నాడని, అతని పేరుతోనే అనేక పనులు గుత్తేదారులుగా దక్కించుకుంటున్నారని మున్సిపల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ అక్రమ వ్యవస్థకు అసలు సూత్రధారి బీటెక్ అర్హత కలిగిన ఒక ఏఈగా వ్యవహరిస్తున్నాడని, అతని అండదండలతోనే ఈ దందాలు సాగుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ కమిషనర్ బాధ్యతలు చేపట్టినా తమపై ఎవరూ చేయి వేయలేరన్న ధీమాతో ఈ బృందం తిరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇక కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేయాల్సిన మరో ఉద్యోగి కూడా ఈ సిండికేట్‌లో భాగస్వామిగా మారి, తన విధులను పక్కన పెట్టి వసూళ్లపై దృష్టి సారించాడని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ వ్యవస్థను అడ్డం పెట్టుకుని సాగుతున్న ఈ బరితెగింపు దందాలకు సంబంధిత ఏఈ ఇచ్చే రక్షణే ప్రధాన కారణమని మున్సిపల్ సిబ్బంది వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇటీవల ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తోదిక శ్రీనివాస్ విశ్వనాథ్ రాకతో పరిపాలనలో మార్పులు వస్తాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపల్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని ప్రజల సొమ్మును కొల్లగొడుతున్న ఈ అవినీతి మూకలపై కమిషనర్ కఠిన చర్యలు తీసుకుంటారా, లేక ఇప్పటివరకు కొనసాగుతున్న ఈ మాఫియా ప్రభావం ముందుకు కూడా కొనసాగుతుందా అన్నది ప్రస్తుతం ప్రొద్దుటూరులో ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది.