ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుండగా, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలు సంస్థను మరింత దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా ప్రొద్దుటూరులో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రైవేట్ బస్సుల ఇష్టారాజ్యం పెరగడంతో ప్రభుత్వ సంస్థ ఆదాయానికి గండిపడుతోంది.

ప్రొద్దుటూరు పాత బస్టాండ్ ఆవరణలోనే నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ బస్సులు సర్వీసులు నిర్వహిస్తున్నాయి. దువ్వూరు, ప్రొద్దుటూరు మార్గంలో ప్రయాణికులను తరలిస్తున్న ఈ బస్సులు బోర్డులు తగిలించుకుని బహిరంగంగా తిరుగుతున్నా, స్థానిక డిపో అధికారులు పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేరుగా ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం నుంచే ఈ బస్సులు నడుస్తున్నా, సంబంధిత యాజమాన్యం మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోంది.

బస్టాండ్ వెలుపల కూడా పరిస్థితి పెద్దగా భిన్నంగా లేదు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగేలా రహదారిపై ప్రైవేట్ బస్సులు నిలిపినా, అడ్డుకునే అధికారి కనిపించడంలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ సైరన్ మోగిస్తూ కానిస్టేబుల్ వచ్చేసరికి ఆటో డ్రైవర్లు, ఇతర వాహనదారులు పక్కకు తప్పుకుంటుండగా, ప్రైవేట్ బస్సు మాత్రం ఎలాంటి పట్టింపులేకుండా ప్రయాణికులను ఎక్కించుకుంటూ ట్రాఫిక్ నిబంధనలను బేఖాతరు చేస్తోందని స్థానికులు చెబుతున్నారు.

అధికారుల పర్యవేక్షణ లోపంతో ఆర్టీసీకి రావాల్సిన ఆదాయం ప్రైవేట్ యాజమాన్యాల వైపు మళ్లిపోతోందని ఆక్షేపణలు వినిపిస్తున్నాయి. బస్టాండ్ పరిసరాల్లో ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలతో ప్రయాణికులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొంటున్నారు.

ప్రొద్దుటూరు ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ బస్సులపై ఇప్పటికైనా రవాణా శాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు దృష్టి సారించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ ప్రయోజనాలు, ప్రభుత్వ ఆదాయం, ప్రయాణికుల భద్రత దృష్ట్యా కఠిన చర్యలు తీసుకుని అక్రమ సర్వీసులను అరికట్టాలని వారు కోరుతున్నారు.