రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులపై జరుగుతున్న అన్యాయాలు, వేధింపులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి కనీస మానవత్వానికే సవాలు విసిరే స్థాయికి చేరిందని స్థానిక ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.

పట్టణ ప్రజల రోజువారీ జీవితంలో ఉత్పత్తి అయ్యే చెత్త, మురుగు, పెంటను తెల్లవారుజామునే శుభ్రం చేస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే ఈ శ్రమజీవులు, తమ జీవితాలు మాత్రం మురికి కాలువల్లోనే మగ్గిపోతున్నాయనే వేదన వ్యక్తమవుతోంది. తెల్లవారుజామున 5 గంటలకే విధుల్లోకి దిగే ఈ కార్మికులు, రోజంతా చెత్త, మురుగుతో పోరాడుతూ పనిచేస్తున్నా, వారి జీవన ప్రమాణాలు మాత్రం బుగ్గిపాలవుతున్నాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.
శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవర్తనపై కార్మికుల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది. శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులను మనుషులుగా కూడా గౌరవించకుండా, అవమానకరంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏకవచనంతో "ఒరేయ్, తురేయ్" అంటూ పిలుస్తూ, కనీస గౌరవం ఇవ్వకుండా చిన్నచూపు చూస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. ఈ తరహా ప్రవర్తన ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పరాకాష్ఠకు చేరిందని స్థానికులు పేర్కొంటున్నారు.

పారిశుద్ధ్య కార్మికులకు కనీస రక్షణ పరికరాలు కూడా అందడం లేదని ఆరోపణలు ఉన్నాయి. విషపూరితమైన చెత్త, మురుగును శుభ్రం చేసే సమయంలో చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్కులు, కాళ్లకు బూట్లు వంటి ప్రాథమిక రక్షణ సామగ్రి లేకుండానే పనిచేయాల్సి వస్తోందని కార్మికులు చెబుతున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నా, అధికారుల నుంచి తిట్లు, తీవ్ర అనారోగ్యాలే తమ వంతు అవుతున్నాయని వారి వేదన.
ఇక కాంట్రాక్టర్ల దోపిడీ కూడా కార్మికుల జీవనాన్ని మరింత దుర్భరంగా మార్చుతోంది. రాత్రింబవళ్లు చెమటోడ్చి పనిచేసిన శ్రామికుల జీతాల్లో కోతలు విధిస్తూ కాంట్రాక్టర్లు మోసం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కార్మికుల పేర్లపై బిల్లులు తీసుకుని, వేతనాలు మాత్రం పూర్తిగా వారి చేతికి చేరకుండా కాంట్రాక్టర్ల జేబుల్లోకే వెళ్లిపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రతిపక్ష నాయకులు ఎన్నికల సమయంలో పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమంపై పెద్ద పెద్ద హామీలు ఇస్తున్నా, అమలులో మాత్రం మౌనంగా ఉండిపోతున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నాలుగు రోజులు ఈ కార్మికులు విధులను పక్కనబెడితే పట్టణమంతా రోగాల మయమవుతుందని, అలాంటి వ్యవస్థకు వెన్నెముకలైన వారిని చిన్నచూపు చూడటం కన్నతల్లిని అవమానించడమేనని ప్రజా సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తక్షణం స్పందించాలని పట్టణ ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ అవమానకర ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, కాంట్రాక్టర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసి, కార్మికులకు రావలసిన కనీస వేతనాలు, రక్షణ పరికరాలు, సంక్షేమ వసతులు తక్షణమే కల్పించాలని వారు కోరుతున్నారు.













