రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు, : ప్రొద్దుటూరు పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. పట్టణంలోని ప్రధాన వీధులు, సన్నని సందుల్లో గుంపులుగా తిరిగే కుక్కలు చిన్నారులు, ద్విచక్ర వాహనదారులు, పాదచారుల్లో తీవ్ర భయాందోళనకు కారణమవుతున్నాయి. ఎప్పుడెప్పుడు దాడి చేస్తాయోనని ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
వీధి కుక్కల నియంత్రణపై గతంలో మున్సిపల్ అధికారులకు పలుమార్లు విన్నవించినా, పెద్దగా చర్యలు తీసుకోలేదనే విమర్శలు స్థానికుల్లో బలంగా వినిపిస్తున్నాయి. కుక్కల నియంత్రణ, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల పేరుతో గత కమిషనర్ హయాంలో లక్షలాది రూపాయల ప్రజాధనం ఖర్చయినట్లు రికార్డుల్లో చూపించినా, వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు కనిపించలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

నిధులు కాగితాలకే పరిమితమై, కుక్కల సమస్యను తగ్గించేలా ఎలాంటి చర్యలు తీసుకోకుండానే రికార్డుల్లో పనులు చూపించి, ప్రజాధనాన్ని పక్కదారి పట్టించారని స్థానికులు మండిపడుతున్నారు. ధనవంతులు తమ ఇళ్ల ముందు "కుక్కలున్నాయి జాగ్రత్త" అని బోర్డులు పెట్టుకుంటున్న పరిస్థితి వచ్చిందని, ఇదే తరహాలో ఇప్పుడు ప్రొద్దుటూరులోని ప్రతి వీధి మొదట్లో అలాంటి బోర్డులు పెట్టాల్సి వస్తుందేమోనని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.
ఇటీవల జరిగిన ఒక ఘటన పట్టణంలో ఆందోళనకు కారణమైంది. రోజువారీ రంగుల పని చేసుకుంటూ జీవనం సాగించే ఓ పేద మైనార్టీ కుటుంబానికి చెందిన బాలుడు వీధి కుక్కల దాడికి గురయ్యాడు. సదరు బాలుడు ద్విచక్ర వాహనంపై బైపాస్ ముక్తార్ ఆయిల్ మిల్లు వైపు నుంచి ఎర్రగుంట్ల నాలుగు రోడ్ల కూడలికి వస్తుండగా, ఒక్కసారిగా కుక్కల మంద అతనిపై దాడికి తెగబడ్డాయి.
ఆ అకస్మాత్తు దాడిలో బాలుడు బైక్‌పై నుంచి కిందపడిపోవడంతో ముఖం నిండా తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా కుడి కాలి చివరి వేలు విరిగిపోయింది. ప్రమాద సమయంలో ఆ మార్గంలో ఏదైనా భారీ వాహనం వచ్చి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా మారేదని అక్కడున్న స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో పట్టణంలో తల్లిదండ్రులు, వాహనదారుల్లో భయం మరింత పెరిగింది.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇప్పటికైనా మున్సిపల్ యంత్రాంగం మేల్కొని, వీధి కుక్కల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి, చిన్నారులు, ద్విచక్ర వాహనదారులను కుక్కల బెడద నుంచి రక్షించేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కుక్కల నియంత్రణపై క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష చర్యలు తీసుకోవడంతో పాటు, గతంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రొద్దుటూరు ప్రజలు గట్టిగా కోరుతున్నారు. సమస్యను నిర్లక్ష్యం చేస్తే మరిన్ని ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.













