రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో ప్రతిపాదించిన నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రజలు భారీగా నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎస్. ఇర్ఫాన్ భాష ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు.
నివాస ప్రాంతాల మధ్యలో సబ్ స్టేషన్ నిర్మిస్తే తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. "సబ్ స్టేషన్ నిర్మాణం ఆపాలి" అంటూ నినాదాలు చేస్తూ ప్రజలు నిరసన ప్రదర్శించారు. సబ్ స్టేషన్ నిర్మాణం వల్ల విద్యుత్ ప్రమాదాలు, అగ్ని ప్రమాదాల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా ఇర్ఫాన్ భాష మాట్లాడుతూ, దశాబ్దాలుగా ఈ స్థలం వివాదాస్పదంగా ఉందని గుర్తు చేశారు. 2004లో ఈ స్థలాన్ని అమృతమయి ట్రస్ట్ కు అప్పగించారని, గతంలో పేదలకు ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ చేపట్టిన విషయాన్ని ఆయన వివరించారు.
ఊరి బయట ఉండాల్సిన సబ్ స్టేషన్‌ను ఇళ్ల మధ్యలో నిర్మించడం ఏమిటని? గతంలో ఇక్కడ 20 ఏళ్ల కుర్రాడు విద్యుత్ ప్రమాదానికి బలయ్యాడన్నారు. అగ్ని ప్రమాదాలు కూడా జరిగాయి.
అధికార బలంతో ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్మాణాలు చేపట్టడం సరికాదని ఇర్ఫాన్ భాష విమర్శించారు. ప్రజల భద్రతను పక్కన పెట్టి ఇలాంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడం బాధ్యతారాహిత్యమని ఆయన పేర్కొన్నారు.
సబ్ స్టేషన్‌కు తగిన ఫైర్ సేఫ్టీ చర్యలు ఉన్నాయా అనే అంశంపై ఇర్ఫాన్ భాష అధికారులు సమాధానం చెప్పాలని కోరారు.
అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజలకు భరోసా కల్పించాలి.
ఎమ్మెల్యేను ఉద్దేశించి సూటిగా ప్రశ్నించిన ఇర్ఫాన్ భాష, నివాస ప్రాంతాలకు దగ్గరగా సబ్ స్టేషన్ వద్దని తాము గతంలోనే నిరసన తెలిపినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు ముప్పు ఉన్న ప్రాజెక్టులను పునరాలోచించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
విద్యుత్ ప్రమాదాలు, అగ్ని ప్రమాదాల ముప్పు దృష్ట్యా సబ్ స్టేషన్ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వం, సంబంధిత శాఖలపై ఇర్ఫాన్ భాష డిమాండ్ చేశారు. ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రత్యామ్నాయ స్థలంలో సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.













