రాయలసీమ వ్యాపార రాజధాని ప్రొద్దుటూరులో అధికార మార్పు జరిగినా, స్థానిక రాజకీయ సంస్కృతి మాత్రం మారకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార పీఠం ఎటు వైపు ఉంటే అటు ఒంగి నమస్కారాలు పెట్టే నైజం, పాత నేతలను విస్మరించి కొత్తవారికి రెడ్ కార్పెట్ పరిచే అలవాటు స్థానిక వ్యాపార వర్గాలు, చోటా మోటా నాయకుల్లో బలంగా వేరూర్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వ్యక్తిత్వం, ఆత్మగౌరవానికి చిరునామాగా ఉండాల్సిన వ్యాపారవేత్తలు, స్థానిక నాయకులు సిద్ధాంతాలు, విలువలను పక్కనపెట్టి అధికారమే పరమావధిగా వ్యవహరిస్తుండడం పట్ల ప్రొద్దుటూరు రాజకీయ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అధికారంలో ఉన్నవారికే నమస్కారాలు, పదవి పోగానే సంబంధాలు తెగదెంపులు అనే ధోరణి బలపడుతోందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.

2019-2024 వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రొద్దుటూరులో విపరీతమైన భజన రాజకీయాలు సాగిన విషయం అందరికీ తెలిసిందే. ఏ షాపింగ్ మాల్ ప్రారంభమైనా, చిన్న నూతన భవన నిర్మాణం జరిగినా, భూమి పూజ లేదా ప్రైవేట్ శుభకార్యమైనా సరే అప్పటి నాయకుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది బంగారు రెడ్డి పేర్లతో ఊరంతా ఫ్లెక్సీలు వెలిసేవి. సోషల్ మీడియాలో వార్నింగ్ స్టార్ అంటూ బిరుదులు ఇస్తూ, అతిగా అభిమానాన్ని ప్రదర్శించిన సోషల్ మీడియా పులులు, పీఏ గాళ్లు, చోటా మోటా నాయకులు అధికారం పోగానే మాయమయ్యారు.

2024 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అదే పాత దొంగ నీతి మళ్లీ పునరావృతమవుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి రాజ్యంలో, సీనియర్ నేత నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత కాలంలో కూడా అధికారంలో ఉన్న నేతల పేర్లతో శుభకార్యాలకు, ప్రారంభోత్సవాలకు ఆహ్వానాల హోర్డింగ్‌లు దర్శనమిస్తున్నాయి.

నిన్నటి వరకు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దండ ఎత్తిన నోళ్లే, నేడు మారిన రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా కొత్త నేతలకు జై కొడుతున్నాయని స్థానిక వ్యాపార వర్గాల ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది రూపాయల వ్యాపారాలు నడిపే బడా ధనవంతులు, స్థానిక వ్యాపారులు సైతం కనీస ఇంగిత జ్ఞానాన్ని, సొంత వ్యక్తిత్వాన్ని పక్కనపెట్టి అధికార పీఠాల ముందు మోకరిల్లడం శోచనీయమని పౌర సమాజం అభిప్రాయపడుతోంది.

అధికారంలో ఉన్నంతవరకే ఈ ఆర్భాటాలు, ఫ్లెక్సీలు, డప్పు కొట్టడాలు కొనసాగుతాయని, పదవి ఊడగానే కళ్లెత్తి చూడని లోకమిదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రొద్దుటూరు ప్రజలు, వ్యాపారులు ఈ అవకాశవాద రాజకీయాన్ని గ్రహించి, కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం రంగు మార్చే ఇటువంటి చోటా మోటా నాయకులకు సరైన రీతిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని స్థానికులు సూచిస్తున్నారు.