రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు: మాజీ ప్రధాని, భారతరత్న దివంగత రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇర్ఫాన్ బాషా తెలిపారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఇర్ఫాన్ బాషా మాట్లాడుతూ దేశాన్ని ఆధునికత వైపు నడిపించేందుకు ఐటీ, టెలికమ్యూనికేషన్, సాంకేతిక రంగాలకు రాజీవ్ గాంధీ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల భారతదేశం కొత్త సాంకేతిక యుగంలోకి అడుగుపెట్టిందని గుర్తుచేశారు.
యువతకు ఓటు హక్కు కల్పించడం, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి కృషి చేయడం వంటి కీలక నిర్ణయాలు దేశ ప్రగతికి దోహదపడ్డాయని ఇర్ఫాన్ బాషా పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలపర్చడంలో రాజీవ్ గాంధీ పాత్ర విశేషమని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ జాతీయ సమైక్యత, సౌభ్రాతృత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇర్ఫాన్ బాషా పిలుపునిచ్చారు. దేశంలో శాంతి, సామరస్య వాతావరణం నెలకొనేలా ఆయన చూపిన మార్గంలో నడవాలని కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు.













