రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు: విద్యుత్ మీటర్ రీడర్లకు విద్యుత్ సంస్థల్లోనే శాశ్వత ఉద్యోగాలు కల్పించి, పూర్తి స్థాయి ఉద్యోగ భద్రతను నిర్ధారించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ రాష్ట్ర కార్యాచరణ కమిటీ ప్రతినిధులు స్థానిక శాసనసభ్యునికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు తమ సమస్యలు, డిమాండ్లను ఎమ్మెల్యేకు వివరించారు.
తమ నియోజకవర్గ పరిధిలో అనేక సంవత్సరాలుగా విద్యుత్ మీటర్ రీడర్లుగా నమ్మకంగా సేవలు అందిస్తున్నామని మీటర్ రీడర్లు ఎమ్మెల్యేకు తెలిపారు. ప్రతి నెల ఇంటింటికీ తిరిగి మీటర్ రీడింగులు తీసి, వినియోగదారులకు విద్యుత్ బిల్లులు అందజేస్తూ, ఇటు ప్రజలకు, అటు విద్యుత్ సంస్థలకు నిరంతర సేవలు అందిస్తున్నామని వారు పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న స్మార్ట్ మీటర్ల అమలు నేపథ్యంలో తమ ఉపాధికి తీవ్ర ముప్పు ఏర్పడిందని మీటర్ రీడర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది మీటర్ రీడర్లు కేవలం ఈ ఉద్యోగంపైనే ఆధారపడి తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని, స్మార్ట్ మీటర్ల కారణంగా ఉపాధి కోల్పోతే వారి కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ రాష్ట్ర కార్యాచరణ కమిటీ ప్రతినిధులు తమ ప్రధాన డిమాండ్లను ఎమ్మెల్యేకు వివరించారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, విద్యుత్ సంస్థల్లోనే తమ అర్హతలకు అనుగుణంగా ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు కుటుంబాలను ఆదుకునేలా ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న మీటర్ రీడర్లకు వారి విద్యార్హతల ఆధారంగా విద్యుత్ సంస్థల్లోనే Field Assistant, Watchman, Driver తదితర పోస్టుల్లో అవకాశం కల్పించాలని కమిటీ డిమాండ్ చేసింది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యేను ప్రత్యేకంగా కోరినట్లు ప్రతినిధులు తెలిపారు.













