ప్రొద్దుటూరు : ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ TCS ఉద్యోగాల భర్తీ కోసం పూల్ డ్రైవ్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా డిగ్రీ విద్యార్థుల కోసం గురువారం స్థానిక వేదవ్యాస డిగ్రీ కళాశాలలో రాత పరీక్షను నిర్వహించారు.

ప్రొద్దుటూరులోని వివిధ డిగ్రీ కళాశాలల నుంచి మొత్తం 200 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. రాత పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు వచ్చే వారంలో ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం TCS కంపెనీలో ఉద్యోగాల కోసం ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

ఈ సందర్భంగా వేదవ్యాస డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ ఎల్‌. నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, TCS సంస్థ ఈ విధంగా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాత పరీక్షకు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించిందని ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన TCS ప్రతినిధులు రవితేజ, ప్రియాంక, శ్రావణి, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ రవి, కళాశాల అధ్యాపకులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.