ప్రొద్దుటూరు పట్టణంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం కింద ఓటర్ల క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ కోసం ఈ నెలలో రెండు విడతలుగా ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు కమీషనర్ & అసిస్టెంట్ ఎలక్టరల్ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం వివరాలు వెల్లడించారు.

మొదటి విడత ప్రత్యేక క్యాంపెయిన్ ఈ నెల 22, 23 తేదీల్లో, రెండో విడత 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి చెందిన బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్ఓ) ఆయా కేంద్రానికి సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్ (బీఎల్ఏ)తో కలిసి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత పోలింగ్ కేంద్రంలో అందుబాటులో ఉంటారని తెలిపారు.

ఈ ప్రత్యేక క్యాంపెయిన్ సమయంలో ఓటర్ల నుంచి వచ్చే దరఖాస్తులను స్వీకరించడంతో పాటు, ఓటర్లకు ఉన్న సందేహాలను నివృత్తి చేసే ఏర్పాట్లు చేసినట్లు కమీషనర్ వివరించారు. ఓటర్ల పరిశీలన కోసం ఆబ్సెంట్ , షిఫ్ట్ , డెత్ , డబల్ కేటగిరీలకు సంబంధించిన ఓటర్ల ముసాయిదా జాబితాను కూడా పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు.

ఓటరుగా కొత్తగా నమోదుకావాలనుకునే వారు Form-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఇప్పటికే ఓటర్ల జాబితాలో ఉన్న వారి వివరాల్లో మార్పులు, చేర్పులు అవసరమైతే Form-8లో దరఖాస్తు చేసుకోవాలని ప్రొద్దుటూరు ప్రజలకు తూతిక శ్రీనివాస విశ్వనాధ్ సూచించారు.

ప్రత్యేక క్యాంపెయిన్ గురించి విస్తృత ప్రచారం చేయాలని ఎలక్షన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ (ఈఆర్ఓలు), అసిస్టెంట్ ఎలక్షన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ (ఏఈఆర్ఓలు), బూత్ లెవెల్ ఆఫీసర్స్ (బీఎల్ఓలు)కు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి అర్హుడైన ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా ఈ ప్రత్యేక క్యాంపెయిన్‌ను వినియోగించుకోవాలని ప్రజలను ఆయన కోరారు.