రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు: వార్డు అమినిటీస్ సెక్రటరీలు వర్క్ ఛార్ట్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ సూచించారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో సోమవారం వార్డు అమినిటీస్ సెక్రటరీలతో ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డు స్థాయిలో ప్రజలకు అందించే సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి వార్డు అమినిటీస్ సెక్రటరీ తన పరిధిలో వర్క్ ఛార్ట్ ప్రకారం పనులు నిర్వహించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. వర్క్ ఛార్ట్‌లో పేర్కొన్న విధంగా రోజువారీ పనుల ప్రణాళికను అమలు చేస్తేనే ప్రజా సేవలు సక్రమంగా సాగుతాయని తెలిపారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కమిషనర్ ఆదేశించారు. ప్రతి వార్డులో ప్రజా ఫిర్యాదు రిజిస్టర్ తప్పనిసరిగా నిర్వహించాలని, అందులో నమోదైన ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదుల నమోదు, పరిష్కార ప్రక్రియపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
నీటి సరఫరా వ్యవస్థపై కూడా కమిషనర్ సూచనలు ఇచ్చారు. ప్రతిరోజు వాటర్ టెస్టింగ్ నిర్వహించి, నీటి నాణ్యతను నిరంతరం పరిశీలించాలని, నిర్ణీత సమయానికి నీటి సరఫరా జరుగుతుందో లేదో వార్డు అమినిటీస్ సెక్రటరీలు స్వయంగా పరిశీలించాల్సిందిగా ఆదేశించారు. నీటి సరఫరాలో లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే మున్సిపల్ సిబ్బంది ప్రధాన లక్ష్యంగా ఉండాలని కమిషనర్ పేర్కొన్నారు. ప్రతి వార్డు అమినిటీస్ సెక్రటరీ తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తేనే పట్టణ అభివృద్ధి, ప్రజా సౌకర్యాల మెరుగుదల సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సమావేశంలో వార్డు అమినిటీస్ సెక్రటరీలు పాల్గొన్నారు.













