రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా పులివెందులలో టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ అవినాష్ రెడ్డి వ్యాఖ్యలను టిడిపి నేత బీటెక్ రవి తీవ్రంగా ఖండించారు. వైఎస్ కుటుంబ సభ్యుల ప్రవర్తన, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ వ్యవహార శైలిపై ఆయన మండిపడ్డారు.
ఎన్నికల విషయంలో వైఎస్సార్‌సీపీ పార్టీకి భయం పట్టుకుందని, అందుకే కోర్టుల చుట్టూ తిరుగుతోందని బీటెక్ రవి విమర్శించారు. వార్డుల మార్పు పేరుతో ఎన్నికలపై స్టే కోరడం సరికాదని, పిటిషన్‌ను ఉపసంహరించుకుని నేరుగా ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం చూపాలని ఆయన అభిప్రాయపడ్డారు.
మైనర్ విద్యార్థులను రాజకీయ కార్యక్రమాలకు తరలించిన ఘటనపై బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, విద్యాసంస్థల అనుమతి లేకుండా విద్యార్థులను తీసుకెళ్లారని ఆరోపిస్తూ, ఇది బాధ్యతారహిత చర్యగా అభివర్ణించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
విద్యాసంస్థల యాజమాన్యాలే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బీటెక్ రవి వెల్లడించారు. విద్యార్థులను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం అంగీకారయోగ్యం కాదని, ఇలాంటి చర్యలను వెంటనే నిలిపివేయాలని ఆయన కోరారు.
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని బీటెక్ రవి హితవు పలికారు. తాడిపత్రి–ముద్దనూరు ఫోర్‌లేన్ అనుసంధానంపై ఎంపీ స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసే అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టకుండా, రాజకీయ ఆరోపణలకే పరిమితమవుతున్నారని విమర్శించారు.
“ఊరు గొప్ప.. పేరు దిబ్బ అన్నట్లుగా వైఎస్ కుటుంబీకుల పరిస్థితి ఉంది”
“ఇవాళ నీకు సీబీఐ గుర్తుకొచ్చిందా?”
“వివేకా హత్య కేసులో సీబీఐ వచ్చినప్పుడు కర్నూలులో పోలీసుల వెనుక దాక్కున్నావు”
“సీబీఐ అంటే కనీసం గౌరవం కూడా లేదు.. ఇప్పుడు సీబీఐ గురించి మాట్లాడుతున్నావా?”
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణల సమయంలో జరిగిన ఆందోళనలను బీటెక్ రవి గుర్తుచేశారు. ఆ సమయంలో అవినాష్ రెడ్డి ప్రవర్తన, ఇప్పుడు ఆయన చేస్తున్న వ్యాఖ్యల మధ్య విరుద్ధత స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా మాట్లాడాలని, తమ పదవికి తగిన విధంగా ప్రవర్తించాలని బీటెక్ రవి సూచించారు. ప్రజల సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించాల్సిన సమయంలో వ్యక్తిగత ఆరోపణలు, తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.













