రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: వేంపల్లె: భవన నిర్మాణ కార్మికులకు అమలులో ఉన్న సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో వర్తింపజేయడంతో పాటు, గత ఏడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లకు తక్షణమే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక పట్టణంలోని ఎస్టీయూ కార్యాలయంలో ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బళ్లారాపు రామాంజనేయులు అధ్యక్షత వహించారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి కే.సీ. బాదుల్లా, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే. లింగన్నలు పాల్గొని కార్మికుల సమస్యలను వివరించారు.
నాయకులు మాట్లాడుతూ 2019 నుంచి కడప జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల క్లెయిమ్‌లను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. 2020కు ముందు జారీ చేసిన గుర్తింపు కార్డులను కార్మికులపై భారం మోపకుండా ప్రభుత్వమే ఉచితంగా పునరుద్ధరించాలని సూచించారు.
బకాయి రుసుము చెల్లించిన కార్మికులకు సంక్షేమ పథకాలు పొందేందుకు వీలుగా 298 జీవోను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రమాద బీమా, తాత్కాలిక, శాశ్వత అంగవైకల్యం, వైద్య ఖర్చులు, కార్మికుల పిల్లలకు స్కాలర్‌షిప్ వంటి సంక్షేమ పథకాలను తిరిగి అమల్లోకి తీసుకురావాలని కోరారు.
ప్రసూతి సహాయాన్ని ప్రస్తుతం ఉన్న రూ. 20 వేల నుంచి రూ. 40 వేలకు పెంచాలని, సహజ మరణానికి ఇచ్చే పరిహారాన్ని రూ. 60 వేల నుంచి రూ. లక్షకు పెంచాలని నాయకులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. కార్మికుల కుమార్తెల వివాహానికి సంబంధించి ప్రకటనల్లో రూ. 40 వేలుగా పేర్కొంటూ, జీవో ఉత్తర్వుల్లో మాత్రం రూ. 20 వేలు మాత్రమే ఇవ్వడం అన్యాయమని వారు అభిప్రాయపడ్డారు.
వెంటనే జీవోలను సవరించి, ప్రకటనల్లో పేర్కొన్నట్లుగానే రూ. 40 వేల వివాహ కానుక చెల్లించేలా కార్మిక శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్మిక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేసి, స్థానిక కార్యాలయాల్లో అధికారులు ప్రతిరోజూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సంఘం వర్కింగ్ జిల్లా ప్రెసిడెంట్ ఏసుబు, మండల కార్యదర్శి బాలాజీ, ఈశ్వరయ్య, నాగేశ్వరరావు, హనుమంతు, చలపతి, వెంకటరమణ, చంద్రగుప్త, శ్రీను, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.













