వేంపల్లె: నేటి యువత కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, స్వయంగా స్టార్టప్‌లను స్థాపించి ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని వక్తలు పిలుపునిచ్చారు. ఆర్జీయూకేటీ ఆర్కే వ్యాలీ క్యాంపస్‌లో మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ‘స్టార్టప్ కడప – ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ ఎకో సిస్టం’ అనే అంశంపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కడప జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చెందిన స్టార్టప్ కడప – ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ ఎకో సిస్టం ప్రతినిధి గోవర్ధన్, ఆయన బృందం హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టరేట్ ప్రతినిధులు విద్యార్థులు నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేయడానికి అవసరమైన సూచనలు, అవకాశాలను వివరించారు.

వక్తలు యువత కేవలం ఉద్యోగులుగానే ఉండిపోకుండా, సొంతంగా పరిశ్రమలు స్థాపించి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల వినూత్న ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ద్వారా లభించే వివిధ రకాల సహాయ సహకారాలు, ఆర్థిక సాయం పొందే మార్గాలను క్షుణ్ణంగా వివరించారు. స్టార్టప్‌ల స్థాపన, వ్యాపార ప్రణాళికలు, పెట్టుబడుల సమీకరణ, ప్రభుత్వ పథకాల వినియోగం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

అనంతరం ఆర్జీయూకేటీ డైరెక్టర్ ప్రొఫెసర్ జి. విజయ్ ప్రకాష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఆర్కే వ్యాలీలో చదువుతున్న విద్యార్థులు వినూత్న ఆలోచనలతో ముందుకు సాగి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన సూచించారు. విద్యార్థులు తమ విజ్ఞానాన్ని, ప్రతిభను సమర్థంగా వినియోగించి దేశ అభివృద్ధికి తోడ్పడాలని, భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో క్యాంపస్ పరిపాలనాధికారి డా. పి. రవికుమార్, డీన్ అకాడమిక్స్ డి. రమేష్ కైలాస్, పరిశోధన–అభివృద్ధి సమన్వయకర్తలు డాక్టర్ బి. కొండారెడ్డి, డాక్టర్ సిహెచ్. రత్నకుమారి, మేనేజ్‌మెంట్ విభాగం అధిపతి డా. కే. కళ్యాణ్ చక్రవర్తి, పీఆర్వో డా. జి. తిరుపతి రెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ అబ్రహం, ఇతర అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.