రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: వేంపల్లి పట్టణంలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కడప జిల్లా పోలీస్ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తెచ్చింది. వేంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను జిల్లా ఎస్పీ షిల్కే నచికేత్ విశ్వనాథ్ గురువారం అధికారికంగా ప్రారంభించారు. పట్టణంలోని కీలక ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా ఈ అత్యాధునిక నిఘా వ్యవస్థను రూపకల్పన చేసినట్లు పోలీసులు తెలిపారు.
పట్టణంలోని ప్రధాన జంక్షన్లు, కూడళ్లు, రద్దీగా ఉండే ప్రదేశాలు, అలాగే నేరాలు జరిగే అవకాశమున్న 18 కీలక ప్రాంతాలను ముందుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో మొత్తం 44 సిసి కెమెరాలను అమర్చారు. వీటిలో వాహనాల నంబర్ ప్లేట్లను స్పష్టంగా గుర్తించగల 6 ANPR కెమెరాలు, 38 మెగాపిక్సెల్ హై డెఫినిషన్ కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాలన్నింటినీ వేంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు.
కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన Large Screens ద్వారా పట్టణ పరిధిలోని అన్ని ప్రాంతాలను పోలీసులు 24 గంటలూ నిరంతరం పర్యవేక్షించనున్నారు. నేరాలు జరిగే సమయాల్లో వెంటనే స్పందించేందుకు, నేరస్థులను వేగంగా గుర్తించి పట్టుకునేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడనుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ షిల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ, దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు, ఇతర నేరాలను అడ్డుకోవడంతో పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరస్థులను వేగంగా గుర్తించేందుకు ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. దాతల ఆర్థిక సహకారంతోనే ఈ కెమెరాల ఏర్పాటు సాధ్యమైందని ఆయన వెల్లడించారు.
ప్రజల రక్షణ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎస్పీతో పాటు డీఎస్పీ మురళీ నాయక్, స్థానిక సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పట్టణంలో ఇటువంటి అధునిక నిఘా వ్యవస్థ అందుబాటులోకి రావడం పట్ల స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేరాలు తగ్గుముఖం పడతాయని, మహిళలు సహా ప్రజల భద్రత మరింత మెరుగుపడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. కొత్త వ్యవస్థతో పోలీసుల స్పందన వేగం పెరగడంతో పాటు, నేరస్థులకు గట్టి హెచ్చరికగా నిలుస్తుందని స్థానికులు భావిస్తున్నారు.













