వైయస్ ఆర్ జిల్లా వేంపల్లి మండలంలో ప్రేమ పెళ్లి పేరుతో యువకుడిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కడపకు చెందిన ఎస్తర్ రాణి, వేంపల్లి మండలం కత్తులూరు గ్రామానికి చెందిన వెంకట ప్రసాద్ రెడ్డితో రెండేళ్లుగా ప్రేమ సంబంధం కొనసాగించినట్లు సమాచారం. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన నుంచి సుమారు ఆరు లక్షల రూపాయలు తీసుకుందని వెంకట ప్రసాద్ రెడ్డి ఆరోపించారు.

పులివెందులలోని వెటర్నరీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఎస్తర్ రాణి, ప్రేమ పెళ్లి పేరుతో వెంకట ప్రసాద్ రెడ్డితో సన్నిహితంగా మెలిగినట్లు తెలుస్తోంది. పెళ్లి ఏర్పాట్ల పేరుతో పలుమార్లు డబ్బులు తీసుకున్నట్లు యువకుడు పోలీసులకు తెలిపాడు. పెళ్లి బట్టలు కొనుగోలు చేయాలంటూ ఎస్తర్ రాణి, వెంకట ప్రసాద్ రెడ్డితో కలిసి హైదరాబాద్ లో షాపింగ్ కూడా చేసినట్లు సమాచారం.

పెళ్లి రోజు ఉదయం గండి క్షేత్రంలో వివాహం జరగాల్సి ఉన్న సమయంలో పరిస్థితులు మారాయి. ఆ సమయంలో ఎస్తర్ రాణి, "పెళ్లి చేసుకుంటే అమ్మ ఉరి వేసుకుంటుంది" అని చెప్పి, తన ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసినట్లు యువకుడు పేర్కొన్నాడు. దీంతో పెళ్లి కార్యక్రమం నిలిచిపోయి, వెంకట ప్రసాద్ రెడ్డి కుటుంబం తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు తెలిసింది.

ఈ ఘటనతో మోసపోయానని భావించిన వెంకట ప్రసాద్ రెడ్డి, వేంపల్లి పోలీసులను ఆశ్రయించాడు. తనతో రెండేళ్లుగా ప్రేమ పేరుతో మెలిగి, పెళ్లి చేస్తానని నమ్మించి, ఆరు లక్షల వరకు డబ్బులు తీసుకుని చివరి నిమిషంలో వెనక్కి తగ్గిందని ఎస్తర్ రాణిపై ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు ఆధారంగా వేంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్తర్ రాణిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ప్రేమ, పెళ్లి పేరుతో డబ్బులు వసూలు చేసిన అంశంపై, అలాగే పెళ్లి రోజు అకస్మాత్తుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా పోయిన విషయంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటనతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రేమ సంబంధాలు, పెళ్లి పేరుతో ఆర్థిక లావాదేవీలు జరిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఇలాంటి మోసాలకు గురికాకుండా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.